● దాడికి ఉపయోగించిన తల్వార్ స్వాధీనం
కామారెడ్డి క్రైం: హత్యాయత్నం కేసులో ఓ రౌడీ షీటర్‌ను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీకి చెందిన సల్మాన్‌ఖాన్ అనే రౌడీ షీటర్ పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 22న రాత్రి సమయంలో అదే కాలనీకి చెందిన అర్షద్ ఇంటికి వెళ్లి ఆటో రిక్షా, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేయడమే కాకుండా అర్షద్ భార్యపై రాయితో దాడి చేసి గాయపరిచాడు. తల్వార్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. సల్మాన్ ఖాన్ కామారెడ్డి పీఎస్‌కు చెందిన రౌడీషీటర్‌గా ఉన్నాడని తెలిపారు. గతంలో అతనిపై హత్యాయత్నంతోపాటు 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. గురువారం బతుకమ్మకుంట వద్ద సల్మాన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. నేరానికి ఉపయోగించిన 57 సెంటీమీటర్ల తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సై సాయిక్రిష్ణ, సిబ్బందిని అభినందించారు.


