ప్రతిపాదనలు పంపుతున్నా..
నిధులు రాగానే..
నిజాంసాగర్: సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మహమ్మద్‌నగర్ – నర్వ గ్రామాల మధ్య సింగితం రిజర్వాయర్ ఉంది. 1999 సంవత్సరంలో దీనిని నిర్మించారు. రిజర్వాయర్‌కు ఎగువన నిజాంసాగర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని, చందూర్, నిజామాబాద్ రూరల్, గాంధారి మండలాల పరిధిలో కురిసిన వర్షాల వల్ల వాగుల ద్వారా రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రిజర్వాయర్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నిజాంసాగర్ మొదటి ఆయకట్టుకు ప్రాంతానికి ప్రధాన కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. జిల్లాలో రెండేళ్ల క్రితం కురిసిన భారీవర్షాలతో వచ్చిన వరదల కారణంగా రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ కొట్టుపోయింది. దీంతో నీళ్లన్నీ వృథా అయ్యాయి.
తాత్కాలిక మరమ్మతులతోనే సరి..
రెండేళ్ల క్రితం కొట్టుకుపోయిన రిటెయినింగ్ వాల్‌కు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. అప్పట్లో రూ. 8 లక్షల నిధులతో ఇసుక బస్తాలు, మట్టి, మొరంతో అడ్డుకట్ట వేశారు. పూర్తి స్థాయి పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో గతేడాది కురిసిన వర్షాలతో మళ్లీ నీరు వృథా అయ్యింది. రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోతుండడంతో రెండో పంటకు నీరు అందడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిటెయినింగ్ వాల్‌కు పూర్తిస్థాయి మరమ్మతుల కోసం నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. రెండేళ్ల క్రితం రూ. 1.8 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. గతేడాది రూ. 1.5 కోట్లతో కాంక్రిట్ పనుల కోసం రెండోసారి ప్రతిపాదనలు పంపించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువయ్యింది. ఈసారి రూ. 90 లక్షలతో మూడోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు.
సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్‌కు శాశ్వత మరమ్మతులకోసం మూడు దఫాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు. నిధులు వస్తే పనులు చేపడతాం.
– సోలోమన్, ఈఈ, నిజాంసాగర్
భారీ వర్షాలతో కొట్టుకుపోయిన
సింగితం రిటెయినింగ్ వాల్
రెండేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం
వృథా అవుతున్న సాగునీరు..
ఆందోళనలో రైతులు


