కొనుగోలు కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల పరిశీలన

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

కొనుగోలు కేంద్రాల పరిశీలన

ఎల్లారెడ్డి: జిల్లా సివిల్‌ సప్లై, రెవెన్యూ అధికారులు శుక్రవారం హాజీపూర్‌, లింగారెడ్డిపేట కొనుగోలు కేంద్రాలను పరిశీలించా రు. ‘కొనుగోళ్లలో అడుగడుగునా దోపిడీ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు. విచారణ విషయమై డీసీఎస్‌వో వెంకటేశ్వర్లును ‘సాక్షి’ సంప్రదించగా.. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఆయన వెంట కామారెడ్డి సివిల్‌ సప్లైస్‌ డీఎం శ్రీకాంత్‌, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌, తహసీల్దార్‌ ప్రేంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తూతూమంత్రంగా విచారణ!

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీపై అధికారులు చేపట్టిన విచారణ నామమాత్రంగా సాగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు, సొసైటీ సిబ్బంది ఉదయమే రైతులతో మాట్లాడి అధికారులతో తమకు అనుకూలంగా చెప్పాలని బతిమాలినట్లు తెలుస్తోంది. కాగా 40 కిలోల బస్తాకు కిలోన్నర తరుగు తీసుకున్నారని ఎల్లారెడ్డికి చెందిన విఠల్‌ అనే రైతు ‘సాక్షి’తో తెలిపారు. తనతో ఏ అధికారీ మాట్లాడలేదని, తనకు సంబంధించిన ట్రక్‌షీట్‌ను తెప్పించుకుని రైస్‌మిల్లర్లు తన వడ్లు ఉన్న లారీలో ఎలాంటి తరుగు తీసుకోలేదని విచారణలో రాసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. తన వడ్లను కాంటా పెట్టినందుకు క్వింటాలుకు రూ. 48 హమాలీ, లారీ డ్రైవర్లకు బస్తాకు రూపాయి చొప్పున చెల్లించానని ఎల్లారెడ్డి సొసైటీ మాజీ చైర్మన్‌ బోండ్ల సాయిలు చెబుతుండడం గమనార్హం. ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీలో లారీ డ్రైవర్లు బస్తాకు రూపాయి తీసుకున్నా ఇతర గ్రామాలలో బస్తాకు రెండు నుంచి మూడు రూపాయలు తీసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమేనన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సరైన విచారణ జరిపించాలని రైతులు కోరుతున్నారు.

అవకతవకలు జరగడం లేదు

ఎల్లారెడ్డి: మండలంలోని ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనూ అవకతవకలు జరగడం లేదని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం డీసీఎస్‌వో, డీఎం, ఎల్లారెడ్డి ఆర్డీవో, తహసీల్దార్‌లు హాజీపూర్‌, లింగారెడ్డిపేట్‌, ఎల్లారెడ్డిలలో పర్యటించి, విచారణ జరిపారని తెలిపారు. ఎక్కడా అవకతవకలు జరగలేదని గుర్తించామని పేర్కొన్నారు. ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement