సిట్‌ విచారణకు హాజరు | - | Sakshi
Sakshi News home page

సిట్‌ విచారణకు హాజరు

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

సిట్‌ విచారణకు హాజరు విపత్తుల నిర్వహణపై టేబుల్‌టాప్‌ ఎక్సర్‌సైజ్‌ టీబీ రాకుండా చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి టౌన్‌ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణకు డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్‌ హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ కమాండ్‌, కంట్రోల్‌ టవర్స్‌లోని సిట్‌ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంప ప్రసాద్‌ మాట్లాడుతూ గతంలో తన ఫోన్‌ ట్యాప్‌ అయిందనే విషయం సిట్‌ అధికారులు చెప్పేంత వరకు తనకు తెలియదన్నారు. దీనివల్ల తన వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమానాలు, డేటా లీకేజీ అంశాలపై అధికారులు అడిగిన ప్రశ్నలకు తన వాంగ్మూలాన్ని ఇచ్చానన్నారు. ఆయన వెంట పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఐరేని సందీప్‌ కుమార్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్‌ తదితరులున్నారు.

కామారెడ్డి క్రైం: విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్రస్థాయి టేబుల్‌టాప్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్‌ విక్టర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గిరి, జిల్లా ఫైర్‌ అధికారి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఇందులో చర్చించారు. ఇలాంటి టేబుల్‌టాప్‌ ఎక్సర్‌సైజ్‌లు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితులు, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

తాడ్వాయి: టీబీ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని క్షయ నియంత్రణ విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ విజయ్‌ సూచించారు. శుక్రవారం కన్‌కల్‌ గ్రామంలో టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ నిర్వహించారు. దగ్గు, జ్వరం, బరువుతగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మహేష్‌, సూపర్‌వైజర్‌ శ్యాం, టెక్నిషియన్‌ దత్తాద్రి, సిబ్బంది రాకేష్‌, లక్ష్మి, ఆశావర్కర్లు జ్యోతి, లత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement