● 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన
గద్వాల జిల్లా వాసి
● గుర్తించి కుమారులకు అప్పగించిన
కామారెడ్డి పోలీసులు
కామారెడ్డి క్రైం: మానసిక స్థితి సరిగా లేక సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు కుటుంబం చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా పుటాన్‌పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ 24 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఆయన మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో కుటుంబాన్ని చేరలేకపోయాడు. చిన్నచిన్న పనులు, భిక్షాటన చేసుకుంటూ ఎక్కడపడితే అక్కడ జీవించాడు. ఆరోగ్యం, మానసిక పరిస్థితి సక్రమంగా లేని స్థితిలో గురువారం రాత్రి కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి ఆయనను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కాస్త కోలుకున్నాక అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చి వాకబు చేయించారు. వివరాలు సరైనవే అని తేలడంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కామారెడ్డికి పిలిపించారు. శుక్రవారం ఉదయం సత్యనారాయణ ఇద్దరు కుమారులు శివశంకర్, జ్ఞాన చారి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఇంతకాలం ఎక్కడ ఉన్నావని, ఎలా ఉన్నావని తండ్రిని అడిగారు. సత్యనారాయణ వద్దనుంచి సరైన సమాధానం రాకపోగా, కొడుకులను చూసిన ఆనందంలో బోరున విలపించాడు. చాలాచోట్ల గాలించినా అప్పట్లో తమ తండ్రి ఆచూకీ దొరకలేదని సత్యనారాయణ కుమారులు తెలిపారు. ఇంత కాలానికి తండ్రి ఆచూకీ లభించినందుకు సంతోషంగా ఉందంటూ కామారెడ్డి సీఐ నరహరి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తండ్రిని వెంట తీసుకుని వెళ్లారు.


