పోలీస్ డిపార్ట్‌మెంట్ మాఫియాలా తయారయ్యిందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విమర్శించారు. శుక్రవారం బాన్సువాడలో ఆర్డీవో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక ప్రధాన సమస్యగా ఉందన్నారు. వారం రోజుల క్రితం బిచ్కుంద మండలం దేవాడ గ్రామానికి చెందిన నలుగురు ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు ఇసుక కోసం ట్రాక్టర్లు తీసుకొని మంజీర నదిలోకి వెళ్లారని, పోలీసులు వచ్చి వాటిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో పోలీసులకు ఫోన్ చేస్తే ఎస్పీ ఆదేశాలతోనే ట్రాక్టర్లు పట్టుకొచ్చామని చెప్పారన్నారు. ఎస్పీకి ఫోన్ చేస్తే ట్రాక్టర్లపై కేసులు చేయాల్సిందేనంటున్నారన్నారు. వారం రోజులుగా ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాయని, గరీబోళ్లు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇసుక తీసుకెళ్తున్నా అడ్డుకోవడం లేదన్నారు. ‘‘వాళ్లు మీకు కనబడరు.. గరీబోళ్లు మాత్రం కనబడతారు’’ అని పేర్కొన్నారు. ఎస్పీకి మానవత్వం లేదని, ఆయనకు జిల్లాలో ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు.


