● నష్టపోతున్న అన్నదాత
● పట్టించుకోని అధికారులు
ఎల్లారెడ్డి: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు కొనుగోలు కేంద్రాలలో అరిగోస తప్పడం లేదు. ధాన్యం సేకరణలో కొర్రీలతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోంది. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన నాటి నుంచే కష్టాలు మొదలవుతున్నాయి. తేమ శాతం పేరుతో, చెత్తాచెదారం పే రుతో నిర్వాహకులు ఇబ్బందిపెడుతున్నారు. రోజుల తరబడి వడ్లను ఆరబెట్టి, తేమ శాతం 18 శాతానికి తగ్గిన తర్వాత తీసుకువచ్చినా తరుగు పేరుతో ఇబ్బందులు తప్పడం లేదు. నిర్వాహకులు 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తీరా తూకం అయ్యాక లారీలు రాకపోవడంతో మరో వారం పాటు ఎదురుచూడాల్సి వస్తోందని, ధాన్యం బస్తాలను కాపాడుకోవడానికి కాపాలా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తరలించడానికి ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీలోని కొనుగోలు కేంద్రానికే రెండు రోజులకో లారీ వస్తోంది. మిగతా కొనుగోలు కేంద్రాలకు మూడు నాలుగు రోజులకో లారీ కూడా రావడం లేదని తెలుస్తోంది. వడ్లను మిల్లులకు తరలించాక లారీకి 10 నుంచి 20 బస్తాల వరకు మిల్లర్లు తరుగు తీస్తున్నారని, లేకపోతే అన్‌లోడ్ చేసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటా చేసినప్పటి కంటే మిల్లుకు వచ్చేటప్పటికి ధాన్యం బరువు తగ్గిపోయిందని, అందుకే బస్తాలు తక్కువ తీసుకుంటున్నామని మిల్లర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఇటు హమాలీలు.. అటు లారీ డ్రైవర్లు..
ధాన్యం తూకం వేసినందుకు క్వింటాలుకు రూ. 48 రూపాయల హమాలీ వసూలు చేస్తున్నారు. ఇంతేగాక చాయ్, కల్లు పేరుతో మరో రూ. 500 తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బస్తాకు రెండు రూపాయలచొప్పున లారీ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో దోపిడీ గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే ధాన్యాన్ని కొంటారో లేదోనని చాలామంది ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
హమాలీలు బస్తాకు రూ. 48 తీసుకుంటున్నరు. ధాన్యా న్ని తరలించినందుకు లారీ డ్రైవర్లు బస్తాకు రెండు రూపాయలు అడుగుతున్నరు. బహిరంగంగానే తరుగు తీస్తున్నరు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– నీరుడి పౌరాజు, రైతు, హాజీపూర్
రైస్ మిల్లర్లు వారు లారీకి 10 నుంచి 20 సంచులు తరుగు తీస్తున్నరు. ప్రశ్నిస్తే అన్‌లోడ్ చేసుకోవడం లేదు. బాగా ఆరబెట్టి, పొల్లు లేకుండా ధాన్యం తెచ్చినా మళ్లీ ఎందుకు తరుగుతీస్తున్నరో అర్థం కావడం లేదు.
– కడావత్ ధూప్యా, రైతు, కట్టకింది తండా
రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఽనిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. దానిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – విక్టర్, అదనపు కలెక్టర్
40 కిలోల ధాన్యానికి కేంద్రాల నిర్వాహ కులు కిలోన్నర తరుగు తీసుకుంటున్నారు. ఇదేమని అడిగితే తేమ ఎక్కువగా, పొల్లు ఉందని సాకులు చెబుతున్నారు. ఎవరికి చెప్పినా లాభంలేదు. – విఠల్, రైతు, ఎల్లారెడ్డి


