కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఆర్టీసీ బస్‌స్టేషన్ విచారణ నంబర్‌ను మార్చినట్లు డీపో మేనేజర్ దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు బస్సు వేళలు, ఇతర వివరాల కోసం ఇకపై 73828 44080 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
భిక్కనూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బడి బాట కార్యక్రమం షెడ్యూల్‌ను పునఃపరిశీలించాలని తపస్ రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరెడ్డి కోరారు. గురువారం ఆయన భిక్కనూరులో విలేకరులతో మాట్లాడారు. జనగణనలో మెజారిటీ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని, అదే సమయంలో ప్రభుత్వం బడిబాటను ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు రకాలైన ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: తల్లిదండ్రులు తమ పిల్ల ల క్రమశిక్షణ, అభివృద్ధిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ సూచించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం కళాశాలలో తల్లిదండ్రులు –అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రగతి, తరగతులకు హాజరయ్యే తీరు, వ్యక్తిత్వ వికాసం, పరీక్షల విధానం, సౌకర్యాలు, అధ్యాపకుల బోధన శైలి తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు జయప్రకాష్, విశ్వప్రసాద్, సుధాకర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: ఆలయాల భూములను పరిరక్షించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు అన్నారు. నగరంలోని సర్వే నంబర్ 341,342లో నీలకంఠేశ్వర ఆలయ భూముల సర్వేను గురువారం చేపట్టారు. 3 ఎకరాల 9 గుంటల భూమిలో ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు.
మాయమైన నీడ
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): సూర్యుని కిరణాలు నిటారుగా పడడంతో గురువారం మధ్యాహ్నం 12.14 గంటల ప్రాంతంలో నీడ మాయమైంది. ఈ అరుదైన ‘నో షాడో డే’ను వీక్షించేందుకు జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్ (శంకర్‌భవన్) కోటగల్లీలో గురువారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటర్ బాటిళ్లు, నిలువు కర్రలు ఆరుబయట ఉంచి నీడమాయమైన (నోషాడో) దృశ్యాన్ని వీక్షించారు. ఇలాంటి ఘటనలు అరుదుగా చోటు చేసుకుంటాయని జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ తెలిపారు.


