భిక్కనూరు: జనగణన ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన రాజంపేటలో జనగణన సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు జనాభా వివరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గడుపులోపు సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు సూచించారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
రాజంపేట, ఆరుగొండ, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. హమాలీల కొరత, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా రాజంపేట బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులకు సూచనలిచ్చారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినవారిని సత్కరించారు. బాలికల పాఠశాలలో గదుల పరిస్థితిని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. మరమ్మతులకు అంచనాలను తయారుచేయాలని పంచాయతీరాజు అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ నిధులలోంచి 50 శాతం నిధులను గదుల మరమ్మతులకు వినియోగించుకోవాలని, మిగతా నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, డీఈవో రాజు ఎంపీడీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


