● హమాలీల సంఖ్య పెంచండి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో మక్కల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మండలాలవారీగా మొక్కజొన్న కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని సహకార శాఖ అధికారులకు సూచించారు. సొసైటీ స్థాయిలో హమాలీల సంఖ్యను పెంచాలన్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన గోదాములను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. లారీ రవాణా కాంట్రాక్టర్ అవసరమైనన్ని లారీలను సమకూర్చాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా సహకార, మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.
ఎన్యుమరేటర్లకు సహకరించాలి
కామారెడ్డి క్రైం: గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ అధికారులు, బిల్ కలెక్టర్లు జనగణన ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జనగణన–2027 లో భాగంగా చేపడుతున్న గృహ గణన, జాబితా తయారీపై గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు ఇచ్చారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ పరిధిలో గృహాల వివరాలను ఆన్‌లైన్ యాప్ ద్వారా నమోదు చేయాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉదయం, సాయంత్రం వేళల్లో వివరాలు సేకరించాలని సూచించారు.


