రైతు వేదికలో కొనసాగుతున్న పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఆవిర్భావ సమయంలోనే రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్ మండలాలు ఏర్పాటయ్యాయి. తర్వాత పాల్వంచ, డోంగ్లీ, మహ్మద్‌నగర్ మండలాలను ఏర్పాటు చేశారు. అయితే ఆయా మండలాల్లో మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించకపోవడంతో అధికారులు, సిబ్బందితో పాటు పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
● రామారెడ్డి మండలం ఏర్పాటై పదేళ్లవుతోంది. ఇక్కడ మండల పరిషత్ కార్యాలయాన్ని మండల విద్యావనరుల కేంద్రం భవనంలో నిర్వహిస్తున్నారు. అదే భవనంలో ఎంఈవో కార్యాలయం కూడా ఉంది. తహసీల్ కార్యాలయం సొసైటీ భవనంలో కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్‌కు గ్రామ పంచాయతీ భవనాన్ని కేటాయించి, పంచాయతీని ఆయూష్ భవనంలో నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ మండలంలో అన్ని కార్యాలయాలు అవస్థల మధ్యే కొనసాగుతున్నాయి.
● రాజంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయం మండల విద్యావనరుల కేంద్రంలో, తహసీల్ కార్యాలయం పీహెచ్‌సీ భవనంలో, పోలీస్ స్టేషన్ సొసైటీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఎంఈవో కార్యాలయాన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నారు.
● బీబీపేట మండలం పరిస్థితీ అంతే.. మండల పరిషత్ కార్యాలయాన్ని మండల విద్యావనరుల కేంద్రంలో, తహసీల్ కార్యాలయాన్ని సొసైటీ భవనంలో, ఎంఈవో కార్యాలయాన్ని స్కూల్ భవనంలో నిర్వహిస్తున్నారు. ఐకేపీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది.
● డోంగ్లీ మండలంలో మండల పరిషత్ కార్యాలయం సొసైటీ భవనంలో, తహసీల్ కార్యాలయం రైతువేదికలో ఉన్నాయి.
● మహ్మద్‌నగర్ మండలంలో మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలను పాత, కొత్త పంచాయతీ భవనాల్లో ఏర్పాటు చేశారు.
● పాల్వంచ మండలంలో మండల పరిషత్‌ను గ్రామ పంచాయతీ భవనంలో, రెవెన్యూ కార్యాలయాన్ని రైతు వేదికలో నిర్వహిస్తున్నారు.
● నస్రుల్లాబాద్ మండలంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిగ్రేటెడ్ భవనం కోసం నిధులు తీసుకువచ్చారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తవడంతో అందులో మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సబ్ సెంటర్ భవనంలో కొనసాగుతోంది.
జిల్లా ఏర్పాటైన ఏడాదికే కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీంతో కలెక్టరేట్ సముదాయం, పోలీసు కార్యాలయాల నిర్మాణాలు పూర్తయి అందులోనే ఆఫీసులు కొనసాగుతున్నాయి. అయితే డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కార్యాలయాలకు మాత్రం నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఇతర శాఖల భవనాల్లో, అరకొర సౌకర్యాల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. మండలాల్లో ఏ చిన్న పని అయినా ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఆఫీసులకు వెళ్లిన వారంతా అక్కడి పరిస్థితులను చూసి అవాక్కవుతున్నారు. సొంత భవనాలు నిర్మించకపోవడంతో అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.
పాలనా సౌలభ్యం కోసం కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన సర్కారు.. ఏళ్లు గడుస్తున్నా ఆయా కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇతర శాఖల భవనాల్లోనే ప్రధాన కార్యాలయాలను నెట్టుకొస్తున్నారు. స్థలం సరిపోక, సరైన వసతులు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త మండలాల ఏర్పాటుతోనే సరి..
కార్యాలయాలకు భవనాల నిర్మాణంపై దృష్టి సారించని సర్కారు
ఇతర కార్యాలయాలలోనే సేవలు
ఇబ్బందులు పడుతున్న అధికారులు


