రుద్రూర్: పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ని ర్వహిస్తుంటారు. కానీ, ఈ స్వచ్ఛంద సంస్థ మా త్రం తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ను పదో తరగతి కోసం సన్నద్ధం చేస్తోంది. వేసవి సెలవులను పిల్లలు వృథా చేయకుండా ప్రతి రోజు ఉదయం మూడు గంటలపాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందీ రుద్రూర్‌లోని రైడ్స్ స్వచ్ఛంద సంస్థ.
మండల కేంద్రానికి చెందిన పూర్వ విద్యార్థులు రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ (రైడ్స్) ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. గత నెల 27న ప్రారంభమైన తరగతులు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 108 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా, ప్రతిరోజూ సుమారు 80 మంది హాజరవుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది సమీప గ్రామాల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. వీరికి వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 17 మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోధిస్తున్నారు.
విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యాబోధనతోపాటు యోగా, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ దాతల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. 1995–96 ఎస్సెస్సీ బ్యాచ్‌కు చెందిన రైడ్స్ సభ్యులు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.


