మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ గోశాలకు మండలంలోని సుల్తాన్‌పేట్‌కు చెందిన సంతోష్ పాటిల్ బుధవారం రూ.11 వేల విరాళాన్ని గోశాల నిర్వాహకులకు అందించారు. గోశాలలో ఆవులు కోసం మేత, వాటి నిర్వహణకు తనవంతు సహాయంగా ఈ నగదును అందించినట్లు ఆయన తెలిపారు. తన కుమారుడు వేదాంత్ పుట్టిన రోజు సందర్బంగా బర్త్‌డే వేడుకకు అయ్యే ఖర్చును గోశాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఐదేళ్లుగా తన కుమారుడు ప్రతి పుట్టిన రోజున గోశాలకు విరాళం అందిస్తున్నానని తెలిపారు.
కామారెడ్డి అర్బన్: విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వివిధ కోర్సుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు విష్ణు, రూప, నేహ, లక్ష్మి, ప్రసన్న, మమత, మౌనిక, వంశీకృష్ణ, మీనా, అక్షయ, రత్న, ఫాతిమా, వర్షిణిలను సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, వార్డు కౌన్సిలర్ సురోజు వనిత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: మేరు కుల కార్పొరేషనన్‌కు నూతనంగా నియమితులైన రాష్ట్ర చైర్మన్ సంఘ వెంకట్ రాజాం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణలను జిల్లా, పట్టణ మేరు సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతి మేరు కుల సభ్యునికి అండగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా, పట్టణ సంఘాల నాయకులు తమ సమస్యలపై చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు ఎస్. నారాయణ, గౌరవ అధ్యక్షులు కొత్తకొండ భాస్కర్, ప్రధాన కార్యదర్శి కొట్టూరు రఘునాథ్, కోశాధికారి ఆర్.సంతోష్, పట్టణ అధ్యక్షులు గట్ల బాలరాజు, గట్ల బాల్ చందర్, తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీఆర్‌ఎస్‌వీ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవాటి సాయిబాబా అన్నారు. బుధవారం ఆయన బాన్సువాడలో మాట్లాడుతూ నీట్ ప్రశ్నాత్రం లీక్ కావడంతో పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం సిగ్గు చేటన్నారు. పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లీక్ అయ్యాయని అన్నారు. నీట్ పరీక్ష లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


