మాచారెడ్డి: తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తామని బుధవారం లచ్చాపేట గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అడ్మిషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎంఈవో దేవేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ పిల్లల్ని ప్రైవేట్ బడికి పంపకుండా ప్రభుత్వ బడికి పంపుతామని ప్రతినబూనారు. గ్రామస్తుల నిర్ణయంతో ఎంఈవో, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వర్ రెడ్డి, పీఎస్ హెచ్‌ఎం శైలజ, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్‌నగర్ నాగా టవర్స్‌లో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. 204 ప్లాట్ నంబర్‌లో నందిపేటలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తించే కొత్తూరు వనజ నివసిస్తున్నారు. ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. 5 తులాల బంగారం, 15 తులాల వెండి, రెండు ఉంగరాలు అపహరణకు గురైనట్లు 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌వో సతీశ్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ప్లంబర్ పని ఉందని అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్లు గుర్తించారు.


