ఇంద్రజాలంతో ‘సంతోషం’ పంచుతూ
గుండె ధైర్యంతో ముందుకెళ్లాలి
భిక్కనూరు: అసలే నిరుపేద కుటుంబం. అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిపాటు మంచానికే పరిమితమై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ఇంద్రజాలం(మేజిక్) నేర్చుకుని నేడు తన ప్రదర్శనలతో అవార్డులు ప్రశంసలు అందుకుంటూ తన ఆదాయంలో 10 శాతం డబ్బులను నిరుపేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నారు భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన మెజీషియన్ కుమ్మరి సంతోష్. ఇంటర్మీడియేట్ చదువుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంతోష్ టీవీలో వస్తున్న మెజీషియన్ సామల వేణు ఇంద్రజాల ప్రదర్శనను చూసి ఇంద్రజాలికుడిగా మారాలని ధృడ సంకల్పం పెట్టుకుని ఆయన వద్ద శిష్యరికం చేసి మేజిక్‌లో అనేక ట్రిక్స్ నేర్చుకున్నారు. నోటిలో నుంచి లింగాలను తీయడం ఖాళీ గ్లాసు నుంచి నీటిని రప్పించడం, నిమ్మకాయల నుంచి రక్తం తీయడం, కళ్లకు గంతలు కట్టుకుని సైకిల్ మోటర్, సైకిల్ నడిపించడంతో పాటు విభూతి సృష్టించడంతో పాటు పలురకాల మేజిక్స్‌లను చేస్తూ సంతోష్ పలువురి మన్ననలను పొందుతున్నారు. మూఢ నమ్మకాల పారద్రోలేందుకు గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రదర్శనలను నిర్వహించడంతో అప్పటి(2017) కలెక్టర్ సత్యనారాయణ ఉత్తమ మెజీషియన్ అవార్డును అందజేసి సత్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటకలో కూడా ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్నలను పొందారు. దీనికి తోడు షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటిస్తూ పలువురుతో శభాష్ సంతోష్ అనిపించుకుంటున్నారు.
నేను ప్రదర్శించే ఇంద్రజాల ప్రదర్శన వల్ల షార్ట్ ఫిల్మ్‌ల వల్ల వచ్చే ఆదాయంలో 10 శాతం డబ్బులను నిరుపేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లల చదువుకు అవసరమైన ఖర్చులను భరిస్తున్నాను. ఎలాంటి ఘటన జరిగినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా గుండె ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
– కుమ్మరి సంతోష్, మెజీషియన్, కంచర్ల
ఆదాయంలో 10 శాతం నిరుపేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్న
ఇంద్రజాలికుడు సంతోష్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న వైనం
నేడు అంతర్జాతీయ మెజీషియన్ డే
సందర్భంగా..
ఇంద్రజాలంతో ‘సంతోషం’ పంచుతూ


