కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు మానుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్
● జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నిరసన
కామారెడ్డి టౌన్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆరోపించారు. వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఆదివారం జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. పాలన చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే విచారణల పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


