నామినేషన్ల విత్‌డ్రాకు ససేమిరా!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తవడంతో ఎన్నికల ప్రచారంపై పార్టీలు ఫోకస్ చేశాయి. ఇదే సమయంలో అభ్యర్థులను ఎంపిక చేసిన ఆయా పార్టీలు.. జాబితాలను వెలువరించనప్పటికీ పోటీ నుంచి తప్పుకోవాలంటూ పలువురిని బుజ్జగిస్తున్నాయి. దీంతో తమకు టికెట్ రాదని తేలిపోవడంతో వారు విత్‌డ్రాకు ససేమిరా అంటున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో ఉంటామని పలువురు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 49 వార్డులున్నాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ లో టికెట్లకోసం భారీ పోటీ ఉంది. అన్ని వార్డుల్లో పోటాపోటీగా నలుగురైదుగురు నామినేషన్లు వేయడంతో అభ్యర్థిగా ఎంపిక చేసిన వారిని వదిలి, మిగతా వారిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. అయితే తాము పోటీ నుంచి తప్పుకునేది లేదంటూ పలువురు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పట్టణంలో సగానికి పైగా వార్డుల్లో టికెట్ దక్కని వారు రెబల్‌గా బరిలో నిలుస్తారని స్పష్టమవుతోంది. కొన్ని వార్డుల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ముగ్గురు, నలుగురు పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీలోనూ కొన్ని వార్డుల్లో పలువురు టికెట్ల కోసం పోటీపడ్డారు. ఓ వార్డులో టికెట్ రాదని తెలిసి సదరు నేత బీఆర్‌ఎస్‌లో చేరాడు. మరో వార్డులో నామినేషన్ వేసిన బీజేపీ నేత.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు.
ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉండగా అధికార పార్టీలో పలువురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. టికెట్టు రాదని ముందే ఊహించిన ఒకరిద్దరు నేతలు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. బాన్సువాడలో కాంగ్రెస్‌లో రెండు వర్గాలకు చెందిన వారు నామినేషన్లు వేశారు. టికెట్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. టికెట్ రాని వారు రెబల్‌గా బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిచ్కుందలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా చేపట్టాయి.
తిరుగుబాట్లు తప్పవా...
టికెట్లు దక్కని వారు చాలాచోట్ల రెబల్‌గా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారిని బుజ్జగించడానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఉపసంహరణకు మంగళవారం వరకు అవకాశం ఉండడంతో సోమవారం అందరితో మాట్లాడి ఉపసంహరింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల తిరుగుబాట్లు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బుజ్జగింపులకు తలొగ్గని నేతలు
అవకాశం ఇవ్వాలని డిమాండ్
రెబల్‌గానైనా బరిలో
ఉంటామంటున్న పలువురు
నామినేషన్ల విత్‌డ్రాకు ససేమిరా!


