ఆస్పత్రిలో చిన్నారి మృతి
కామారెడ్డి టౌన్: ఆ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయా యి. కుక్క కాటుకు వ్యాక్సిన్ తీసుకున్న ఆ బాలిక.. కొద్దిసేపటికే తండ్రి భుజాలపైనే కన్ను మూసింది. దీంతో తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుని రాగా నే దేవుని చెంతకు వెళ్లావా చిట్టి తల్లి అంటూ ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్‌లో నివాసం ఉంటున్న కల్లూరి అర్చన రమేష్ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు క్రితర్ష ఉన్నారు. గత నెల 25న పాప ఇంటి ముందు ఆడుతుండగా వీధి కుక్క కరిచింది. దీంతో అదేరోజు స్థానిక జీజీహెచ్‌లో రేబిస్ వ్యాక్సిన్ మొదటి డోసు, 28న రెండో డోసు ఇప్పించారు. ఆదివారం మధ్యాహ్నం మూడో డోసు ఇప్పించిన కొద్దిసేపటికే పాప తల మెడ కిందకు వాల్చేసి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే పాపను తండ్రి రమేష్ ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మరణవార్త విన్న మృతురాలి బంధువులు వందలాది మంది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. చిన్నారి మృతదేహంతో ఎమర్జెన్సీ వార్డులో బైఠాయించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని ఆరోపిస్తూ వైద్యులు, సిబ్బందిపై దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని వైద్యులను ఓ గదిలో ఉంచి రక్షణ కల్పించారు. వైద్యులను తమకు అప్పగించాలని పోలీసులతో బంధువులు వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్, అద్దాలు, మందులు, ఈసీజీ మిషన్, ఇంజెక్షన్ వాయిల్స్‌ను ధ్వంసం చేశారు. సుమారు 4 గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. ఆర్‌ఎంవో సంతోష్, పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ విషయమై ఆర్‌ఎంవో సంతోష్‌ను వివరణ కోరగా.. సాధారణంగా రేబిస్ వ్యాక్సిన్ వికటించే అవకాశాలు తక్కువని, మరణానికి గల అసలు కారణాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని
కుటుంబ సభ్యుల ఆరోపణ
మృతదేహంతో ఆస్పత్రి ఎదుట
ఆందోళన
ఫర్నిచర్ ధ్వంసం
ఆస్పత్రిలో చిన్నారి మృతి
ఆస్పత్రిలో చిన్నారి మృతి
ఆస్పత్రిలో చిన్నారి మృతి


