ఎన్నికల బరిలో భార్యాభర్తలు
● వేరువేరు వార్డులనుంచి నామినేషన్లు
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల బరిలో భార్యాభర్తలు ఇద్దరూ నిలవడం కామారెడ్డిలో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని 47వ వార్డుకు చెందిన గెరికంటి స్వప్న గత కౌన్సిల్‌లో (2020–2025)లో కౌన్సిలర్‌గా పనిచేశారు. తన వార్డులో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఆమె ఈసారి కూడా అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. స్వప్న భర్త గెరికంటి లక్ష్మీనారాయణ సైతం ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన 46వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ విజయం సాధిస్తే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో ఇద్దరూ కలిసి అడుగుపెట్టే అరుదైన అవకాశం దక్కుతుంది.
కామారెడ్డి క్రైం: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా గతనెల 1 నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 విజయవంతంగా పూర్తయ్యిందని ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల పాటు పరిశ్రమలు, హోటళ్లు్, ఇటుక బట్టీలు, వ్యాపార సముదాయాలు, మెకానిక్ షాపులు, నిర్మాణ రంగం తదితర ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 50 మంది 18 ఏళ్లలోపు పిల్లలను గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో 46 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని తెలిపారు. వీరిలో 14 మంది చిన్నారులు బయటి రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు 21 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1098కు గానీ, డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు.
కామారెడ్డి టౌన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకుగాను మొత్తం 676 మంది నామినేషన్లు వేశారు. ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీజేపీ తరఫున నామినేషన్ వేసిన వ్యక్తి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణలకు గడువు ఉంది.
భిక్కనూరు: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) జాతీయ మహాసభలు ఈ నెల 6 నుంచి 8 వరకు జరుగుతాయని బీఎంఎస్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సందుగారి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన భిక్కనూరులో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీఎంఎస్ జాతీయ మహాసభల్లో కార్మికుల సంక్షేమం కోసం పలు తీర్మానాలను ఆమోదించనున్నట్లు తెలిపారు. కార్మికుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు, జాతీయ తభావాన్ని నింపేందుకు బీఎంఎస్ ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను కూడా ప్రభుత్వం మార్చి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని బీఎంఎస్ ప్రతినిధులను కోరారు.
ఎన్నికల బరిలో భార్యాభర్తలు


