కేవీఆర్‌కు పెరిగిన క్రేజ్‌ | Sakshi
Sakshi News home page

కేవీఆర్‌కు పెరిగిన క్రేజ్‌

Published Mon, May 20 2024 11:05 AM

-

జెయింట్‌ కిల్లర్‌కు బీజేపీలో గుర్తింపు

మొన్న అయోధ్య శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్‌ రాష్ట్ర కన్వీనర్‌గా..

నిన్న జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జీగా..

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి

వరంగల్‌ ఇన్‌చార్జి బాధ్యతలు

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఐదారేళ్లుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ రాయితీ కోసం కొట్లాడారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని వెలికితీశారు. రైతు సమస్యలపై గళమెత్తారు. ఇలా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు చేసి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీ అంటే గిట్టని వారు సైతం వెంకటరమణారెడ్డి వివిధ సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సపోర్ట్‌ చేయడం గమనార్హం.

కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలను ఓడించి..

అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్‌, అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలో దిగినా వెంకటరమణారెడ్డి ఎక్కడా తగ్గలేదు. ఇద్దరినీ ఓడిస్తానని శపథం చేశారు. ఇద్దరు ఉద్ధండులతో జరిగిన పోరులో వెంకటరమణారెడ్డి మూడో స్థానానికి వెళ్లడం ఖాయ మని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణారెడ్డి జెయింట్‌ కిల్లర్‌గా అవతరించారు. ఈ విజయంతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వెంకటరమణారెడ్డి వాక్‌ చాతుర్యం, పోరాట పటిమే ఆయనను గెలిపించాయని బీజేపీ నాయకత్వం గుర్తించింది.

 దీంతో పార్టీ ఆయనకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా కేవీఆర్‌ను నియమించారు. దానికోసం రాష్ట్ర రాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ కార్యక్రమం ముగియగానే లోక్‌సభ ఎన్నికలు రావడంతో జహీరాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జీగా బీజేపీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. దాదాపు మూడు నెలలపాటు జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పర్యటించి, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం చేశారు. 

నేతల మధ్య సమన్వయం కుది ర్చారు. ఎన్నికల సభలు, ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని శ్రేణుల్లో హుషారు పెంచారు. చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, భువనగిరి తదితర పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన పలు సభల్లో ప్రసంగించారు. ప్రస్తుతం నల్గొండ–వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఆయనకు ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. కొన్ని ప్రాంతాల్లో నాయకత్వ సమస్య వేధిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమితులైన వెంకటరమణారెడ్డి.. దాదాపు మూడు నెలల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించారు. జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌, జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్యాడర్‌తో జరిగిన సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో గెలవడం కోసం వ్యవహరించాల్సిన వ్యూహాల గురించి వివరించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 1,72,766 ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్‌ స్థానంలో పార్టీ గెలవాలంటే మరో నాలుగు లక్షల ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇన్‌చార్జి బాధ్యతలు మోసిన వెంటరమణారెడ్డి పార్టీ అభ్యర్థి తరఫున పార్లమెంటు నియోజక వర్గం అంతటా కలియతిరిగారు. ఈ ఎన్నికలలో బీబీ పాటిల్‌ గెలిస్తే బీజేపీలో వెంకటరమణారెడ్డి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

పాటిల్‌ గెలిస్తే మరింత ప్రాధాన్యత
 కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఇద్దరు ఉద్ధండులను ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా మారిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ రాష్ట్ర కన్వీనర్‌గా నియమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా వ్యవహరించారు. ఆయన సమర్థతను గుర్తించిన బీజేపీ.. ప్రస్తుతం జరుగుతున్న నల్గొండ–వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement