
బోధన్‌లో వేటగాడి ఇంట్లో లభించిన తుపాకీ
రెచ్చిపోతున్న వేటగాళ్లు
● నాటు తుపాకులు, ఉచ్చులతో
హతమారుస్తున్న వైనం
● అడవులు, గోదావరి పరీవాహక
ప్రాంతాల్లో వేట
● అరికట్టలేకపోతున్న అటవీశాఖ
మంజీర, ఎస్సారెస్పీ తీరాలలో..
ఎండలు ముదరడంతో అడవుల్లో జీవించే జింకలు, నెమళ్లు, కుందేళ్లు, ఆహారం, నీళ్ల కోసం బయటకు వస్తున్నాయి. నీళ్ల కొలనులకు కొద్ది దూరంలో వేటగాళ్లు మాటు వేసి ఎయిర్‌గన్‌లు, ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నా రు. కాగా మంజీర, ఎస్సారెస్పీ గోదావరి తీరాల్లో పచ్చికబయళ్లు తేలడంతో జింకలు, దుప్పిలు, కుందేళ్లు గడ్డిని తినడానికి బయ టకు వస్తున్నాయి. దీంతో వేటగాళ్లు ఈ ప్రాంతాల్లో ఎక్కువ వేటను సాగిస్తున్నారు. జింక, నెమలి, కుందేలు, ఏదు, దుప్పి, ఉడుము, అడవి పంది మాంసానికి డిమాండ్ ఉండడంతో స్థానిక వేటగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. బడాబాబుల పార్టీలకు సైతం ఇప్పటికీ అటవీ జంతువుల మాంసాన్ని గుట్టుగా సరఫరా చేస్తున్నారనే మాటలు ప్రచారంలో ఉన్నాయి. అధికారులే వేటగాళ్లకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఇందూరు(నిజామాబాద్ అర్బన్)/బోధన్: వేటగా ళ్లు రెచ్చిపోతున్నారు. పచ్చని ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగే వన్యప్రాణులను హతమారుస్తున్నారు. రాత్రు ల్లో అడవులు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మాటువేసి యథేచ్ఛగా వేటాడుతున్నారు. నాటు తుపాకులు ఎక్కుపెట్టి, ఉచ్చులు బిగించి మూగజీవాల ఊపిరి తీస్తున్నారు. ఈ వేటను అటవీ శాఖ అధికారులు అరికట్టలేకపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో రెండు, మూ డు సంఘటనలు వెలుగు చూసినా, అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండడం లేదు. వారం క్రితం బోధన్ ప్రాంతంలో ఓ వేటగాడు పట్టుబడిన విష యం తెలిసిందే. వేటగాడి ఇంట్లో సోదాలు నిర్వ హించగా ఏకంగా జింక చర్మం, కొమ్ములు, నెమలి ఈకలు, ఒక నాటు తుపాకీ లభించింది. అయితే పట్టుబడకుండా దేనికీ జంకని వేటగాళ్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. వారిపై నిఘా పెట్టాల్సిన అటవీ ఆఫీసర్లు డ్యూటీల్లో హాయిగా నిద్రపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
స్థానిక వేటగాళ్లే ఎక్కువ..
కొన్ని నెలల క్రితం సింగరాయిపల్లిలో ఒక వేటగా డు బండరాళ్ల నడుమ ఇరుక్కుపోయిన ఘటనతో నిజామాబాద్, కామారెడ్డి అటవీ సరిహద్దు ప్రాంతా ల్లో వేటగాళ్ల అలజడి ఉందని తేలిపోయింది. దీని తర్వాత సిరికొండ, ఇందల్వాయి అడవుల్లో సైతం వేటగాళ్ల కదలికలు కనిపించాయి. అయితే కొన్ని రోజులకే జిల్లాలో వన్యప్రాణుల వేట పెద్దగా లేదని అటవీ అధికారులు సరైన నిఘా పెట్టడం లేదు. బోధన్ ఘటనతో అటవీ అధికారులు మళ్లీ ఉలిక్కిపడ్డారు. ఈ వరుస ఘటనలను చూస్తే జిల్లాలో వేట ఇంకా సాగుతోందని స్పష్టమవుతోంది. గతంలో హైదరాబాద్ నుంచి వేటగాళ్లు వచ్చి జంతువులను వేటాడిన ఘటనలున్నాయి. రెండేళ్ల క్రితం వర్నిలో కొంతమంది వేటగాళ్లు పట్టుబడగా, వారి వద్ద నాటు తుపాకీ దొరికింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేటగాళ్లు అంతంత మాత్రంగానే ఉండగా, స్థానిక వేటగాళ్లు వన్యప్రాణుల్ని ఎక్కువగా వేటాడి మూగజీవాలను పొట్టన పెట్టుకుంటున్నారు. నాటు తుపాకులు పేల్చి, అలాగే విద్యుత్ వైర్లు, వలల సాయంతో ఉచ్చు బిగిస్తున్నారు.

పట్టుబడ్డ జింక చర్మం(ఫైల్)