గోదావరిలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో యువకుడి గల్లంతు

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

సీతానగరం: మండలంలోని మునికూడలి వద్ద గోదావరిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రాజంపేటకు చెందిన కలిదిండి రాజేష్‌ (19) మునికూడలిలోని రేవులో బుధవారం నీట మునిగిన పడవను నెట్టాడు. ఈ క్రమంలో అదుపుతప్పి గోదావరిలో పడిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యుడు కరుటూరి శ్రీహరిబాబు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్‌కు తండ్రి వెంకయ్య, తల్లి కొండమ్మ, తమ్ముడు వినేష్‌ ఉన్నారు.

నిందితుడి అరెస్టు

కాకినాడ క్రైం: తాళాలు బద్ధులు కొట్టి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ డెయిరీఫాంకు చెందిన దాసరి హరీష్‌ (25) పాత నేరస్తుడు. తాజాగా కాకినాడ టూ టౌన్‌, సర్పవరం, త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలువురి ఇళ్లు కొల్లగొట్టాడు. ఇతడిపై గతంలో 26 కేసులతో పాటు పోర్టు పీఎస్‌లో సస్పెక్ట్‌ షీటు ఉంది. టూ టౌన్‌ సీఐ మజ్జి అప్పలనాయుడు, బృందం నిందితుడిని మంగళవారం నగరంలో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.28 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

బెహ్రెయిన్‌ నుంచి

స్వగ్రామానికి బాధిత మహిళ

రాజోలు/ అమలాపురం రూరల్‌: ఉపాధి నిమిత్తం బ్రెహెయిన్‌ వెళ్లి మోసపోయిన రాజోలుకు చెందిన బాధిత మహిళ నక్కా దుర్గ బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. బెహ్రెయిన్‌లో ఆమె పడుతున్న కష్టాలను బంధువులకు తెలపడంతో వారు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి మైగ్రేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ చొరవతో దుర్గ బెహ్రెయిన్‌ నుంచి రాజోలుకు క్షేమంగా చేరుకుందని డీఆర్వో వీర్ల సుబ్బారావు, మైగ్రేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ మేనేజర్‌ గోళ్ల రమేష్‌ తెలిపారు.

కోరంగి నదిలో దూకిన తల్లి

తాళ్లరేవు: కొడుకుతో జరిగిన వాగ్వాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తల్లి కోరంగి నది(ఆత్రేయ గోదావరి)లో దూకేసిన ఘటన కలకలం రేపింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన అర్ధాని అనిల్‌వర్మ, అతని తల్లి రామలక్ష్మి ద్విచక్ర వాహనంపై కాట్రేనికోన వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అకస్మాత్తుగా బండి పైనుంచి దూకి, పక్కనే ఉన్న కోరంగి నదిలో దూకేసింది. అదే సమయంలో యానాం సావిత్రి నగర్‌ నుంచి సంగాడి ప్రసాద్‌ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై తన అక్కను తీసుకుని కాకినాడ వెళ్తున్నాడు. వంతెన పైనుంచి చూడగా మహిళ (రామలక్ష్మి) నీటిపై తేలియాడుతూ కనిపించింది. అక్కడ చాలామంది జనం ఉండటంతో పాటు భవానీ మాలలో ఉన్న కారణంగా వెళ్లిపోదామని తొలుత అనుకున్నాడు. అయితే, తన అక్క చెప్పడంతో ప్రసాద్‌ బండి దిగి, కోరంగి వంతెన పైనుంచి నదిలో దూకాడు. అతడు పట్టుకునేలోపే రామలక్ష్మి పూర్తిగా నీరు తాగేయడంతో మునిగిపోయింది. అయినప్పటికీ ప్రసాద్‌ ప్రాణాలకు తెగించి మరీ నది లోపలకు వెళ్లి, ఆమెను బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో అతడి అరకాసు బంగారు ఉంగరం నదిలో పడిపోయింది. అయినప్పటికీ పట్టించుకోకుండా రామలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అనంతరం, ఆమెను 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సముద్రంలో వేట చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ఆటో నడుపుకొనే ప్రసాద్‌ సాహసాన్ని పలువురు అభినందించారు. బంగారు ఉంగరం పోయినా తనకు బాధ లేదని, నిండు ప్రాణాన్ని కాపాడటం ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రసాద్‌ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement