● కుక్కర్ల లోడుగా అనుమానిస్తూ వ్యాన్‌ను పట్టుకున్న
తిమ్మాపురం గ్రామస్తులు
● తమకు సంబంధం లేదని విడిచిపెట్టిన పోలీసులు
కాకినాడ రూరల్: పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అధికార కూటమి మద్దతుదారులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తెరతీశారు. నగదుతో పాటు గృహోపకరణాలు చాలా చోట పంపిణీలు చేపట్టారు. ఈ క్రమంలోనే తిమ్మాపురం గ్రామస్తులు ఓటర్లకు పంపిణీ కోసం తరలిస్తున్న కుక్కర్లతో కూడిన ఆటోగా భావించి గురువారం ఉదయం 112 కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఆ ఆటోను రమణయ్యపేటలో నిలుపుదల చేసి సర్పవరం పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే మరో కారణమో తెలియదు గాని కనీసం సరుకును పరిశీలించే ప్రయత్నం చేయని పోలీసులు తమది పరిధి కాదంటూ విడిచిపెట్టారు. తిమ్మాపురం పంచాయతీలో వార్డు మెంబరుగా పోటీలో ఉన్న కూటమి నేత తన వార్డు పరిధిలో పంపిణీ కోసమే కుక్కర్లను సిద్ధం చేసినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తిమ్మాపురానికి చెందిన బెజవాడ సీతారామస్వామి మీడియాతో మాట్లాడుతూ అనుమానాస్పదంగా లోడుతో ఉన్న ఆటో తమను చూసి సర్పవరం వైపు మళ్లడంతో అనుమానం వచ్చి పట్టుకున్నామన్నారు. సర్పవరం పోలీసులకు అప్పగించినా పట్టించుకోలేదని, ఆటోలోని సరుకు వివరాల కోసం కనీసం ఇన్వయిస్‌కు కూడా పరిశీలించలేదని ఆరోపించారు.
బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
ముమ్మిడివరం: 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం మండలం అన్నంపల్లి శివారు లక్ష్మీదేవిలంక వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తలంక గ్రామానికి చెందిన బొక్కా జార్జి ప్రసాద్ మోటారు సైకిల్‌పై మురమళ్ల వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, యానాం నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జార్జి ప్రసాద్‌ను 108లో ఆసుపత్రికి తరలించారు. ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేశారు.


