12 నుంచి ఇంజినీర్లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

12 నుంచి ఇంజినీర్లకు శిక్షణ

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0పై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల ఇంజినీర్లకు ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ కేఎన్‌వీ ప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 269 మందికి ఈ శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాచ్‌కు మూడు రోజుల చొప్పున ఐదు బ్యాచ్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రసాదరావు తెలిపారు. తాగునీటి సరఫరా విభాగంలో పని చేసే ఇంజినీర్లు తప్పని సరిగా శిక్షణలో పాల్గొనాలన్నారు.

అక్రమ అరెస్టులు దారుణం

ప్రత్తిపాడు: ఢిల్లీలో శనివారం జరిగిన ఆందోళనలో పాల్గొన్న న్యాయవాదులు, యువతపై మోదీ సర్కార్‌ చేసిన దాడిని ఆల్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ జస్టిస్‌ (ఐలాజ్‌) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రత్తిపాడులో ఐలాజ్‌ రాష్ట్ర కార్యదర్శి బుగత శివ మాట్లాడుతూ, ఓట్ల అవకతవకలకు పాల్పడిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను కాపాడేందుకు ఢిల్లీని పోలీస్‌ రాజ్యంగా మార్చేశారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, యువతను, న్యాయవాదులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టు చేసిన వారందరినీ తక్షణం విడుదల చేయాలని, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అణచివేయాలని చూడడం పట్ల శివ నిరసన వ్యక్తం చేశారు.

వైద్య సేవలకు అంతరాయం

కిర్లంపూడి: తమను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన బాట పట్టారు. దీంతో వైద్య సేవలకు ఇబ్బంది తప్పడం లేదు. మండలంలోని కిర్లంపూడి, గెద్దనాపల్లి, వీరవరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 మంది కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా తమ డిమాండ్‌లు నెరవేర్చాలంటూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులు నిర్వహించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో నాలుగు రోజుల నుంచి విధులు బహిష్కరించారు. దీంతో ఆసుపత్రిలో పలు సేవలు స్తంభించిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీల్డ్‌ హెల్త్‌ సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులతో అసంపూర్ణ వైద్య సేవలు అందిస్తున్నారు. అనుభవం లేని సిబ్బందితో వైద్యం అందించడంతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని రోగులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement