కాకినాడ లీగల్: నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు ఉంచే స్ట్రాంగ్ రూము వద్ద పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఎన్నికల కోసం రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూము, కౌంటింగ్ కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించి, అక్కడ చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, కాకినాడ ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్, ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్‌ఈ వెంకట్రావు, మున్సిపల్ ఆరోగ్య అధికారి ఎంహెచ్‌ఓ డి.పృథ్వీచరణ్, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పంచారామ క్షేత్రంలో
కలెక్టర్ పూజలు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలో కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యాన ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కలెక్టర్, కుటుంబ సభ్యులు కుమారారామ భీమేశ్వరస్వామిని, బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నంది మండపం వద్ద వారికి ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి ప్రసాదం, ఫొటోను ఈఓ నీలకంఠం అందించారు.
రిసెప్షన్, స్ట్రాంగ్ రూము ఒకేచోట ఏర్పాటు
కాకినాడ లీగల్: నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూము వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనానికి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎంఎన్ హరేంధిర ప్రసాద్ స్పందించారు. ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం (రిసెప్షన్ సెంటర్) మెక్లారిన్ హైస్కూల్లోను, స్ట్రాంగ్ రూమును రంగరాయ వైద్య కళాశాలలోను ఏర్పాటు చేసినట్లు నగర పాలక సంస్థ అధికారులు తొలుత ప్రకటించారు.
ఈ రెండు కేంద్రాలూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో ఎన్నికల అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తరలించే సమయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బ్యాలెట్ బాక్సుల రవాణా సమయంలో ఎలాంటి అవకతవకలకూ అవకాశం ఉండకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి కలెక్టర్ స్పందించారు. రంగరాయ మెడికల్ కళాశాలలోనే రిసెప్షన్ కేంద్రం, ఎన్నికల అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చే బ్యాలెట్ బాక్సుల కోసం అక్కడే స్ట్రాంగ్ రూము ఏర్పాటు చేశారు.


