సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరుస ప్రకృతి విపత్తులు, మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఖరీఫ్ రైతులకు కష్టాలపాలు చేస్తున్నాయి. పంట చేతికందే సమయంలో అర్నబ్, మురసు తుపాన్లు కల్లోలం సృష్టించాయి. వరి పైరు పాలు పోసుకుని, గింజ గట్టిపడే దశలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు జిల్లావ్యాప్తంగా సగానికి పైగా విస్తీర్ణంలో పంట నేలనంటి, నీట మునిగింది. దిగుబడి సైతం గణనీయంగా పడిపోయింది. గతంలో ఎకరాానికి 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 15 బస్తాలు రావడమే కష్టంగా ఉంది. పంటకోత ప్రయోగాల్లో సైతం ఇవే ఫలితాలు వస్తున్నాయి. అరకొరగా మిగిలిన పంటను ఏదో ఒక విధంగా ఒబ్బిడి చేసుకుని, వచ్చిన ధాన్యం విక్రయించి, పెట్టుబడులైనా దక్కించుకుందామని రైతులు ఆశ పడుతున్నారు. కానీ, సవాలక్ష నిబంధనలతో ప్రభుత్వం ఆ ధాన్యం కొనకుండా వారి ఆశలపై నీళ్లు జల్లుతోంది. విపత్తుల సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక దళారులు నిర్ణయించిన ధరకే రైతులు ఉన్న పంటను తెగనమ్ముకుంటున్నారు. ఫలితంగా పెట్టిన పెట్టుబడులు సైతం చేతికందే పరిస్థితి లేక నష్టపోతున్నారు.
అన్నదాతకు ని‘బంధనాలు’
కొద్దో గొప్పో మిగిలిన పంట కోతలను రైతులు ఇప్పటికే ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 257 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. 75 కిలోల బస్తా ఎ–గ్రేడ్ ధాన్యానికి రూ.1,846, సాధారణ రకానికి రూ.1,831గా మద్దతు ధర నిర్ణయించారు. అయితే, ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభు త్వం మెలిక పెట్టింది. తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. తేమ శాతం 17 లోపు ఉంటేనే కొనుగోలు చేస్తా మని చెబుతోంది. మిల్లర్లకు నచ్చితే వారు ఇచ్చే ధరకు విక్రయించుకోవాలంటూ చేతులేత్తేసింది. అయితే, ముంపునకు గురైన పంటలో తేమ శాతం, రంగు మా రి, మొలకలొచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని, ఈ పరిస్థితుల్లో ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు, దళారులు చెప్పేస్తున్నారు. దీంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దళారుల రంగప్రవేశం
ఇదే అదునుగా దళారులు, కొందరు రైస్ మిల్లర్లు రైతులను దగా చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ముక్క విరుగుతోందని, రంగు మారిందని, తాలుతప్ప గింజులున్నాయంటూ సాకులు చెబుతూ, 75 కిలోల బస్తా ధాన్యానికి రూ.300 నుంచి రూ.430 వరకూ కోత పెడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే తాము చెప్పిందే ధరని.. నచ్చకపోతే ధాన్యం వెనక్కు తీసుకెళ్లాలంటూ బెదిరిస్తున్నారు. చేసేది లేక నష్టానికి తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
బేరం రూ.1,700.. ఇస్తున్నది రూ.1,500
కమీషన్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు కుమ్మకై ్క మద్దతు ధర కంటే తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 75 కిలోల బస్తా ధాన్యాన్ని రూ. 1,700కు బేరం చేసుకుని, మిల్లుకు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ధాన్యం బాగోలేదంటూ బస్తాకు రూ.1,500 మాత్రమే ఇస్తామంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వాలని అడిగితే ధాన్యం వెనక్కు తీసుకెళ్లిపొమ్మంటున్నారు. ఆ బాధలు పడలేక అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది.
– బండే వెంకట రమణ, రైతు, వేములవాడ, కరప మండలం
బస్తాకు రూ.400 నష్టం
గింజ పాలు పోసుకునే దశలో వచ్చిన వరుస తుపాన్లతో పంట నే లనంటి, దెబ్బతింది. మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకుని, కళ్లాల్లో ఆరబెట్టుకుని అమ్మితే రంగు మారింది, ముక్క వచ్చిందంటూ వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. దీంతో 75 కిలోల బస్తాకు రూ.300 నుంచి రూ.400 నష్టపోవాల్సి వస్తోంది. పెట్టుబడులు దక్కే పరిస్థితి లేదు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా, తడిసిన, రంగు మారిన, ముక్క వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి.
–తలాటం వెంకటేశ్వర రావు, కౌలు రైతు,
వేములవాడ, కరప మండలం
ధాన్యం.. దళారుల భోజ్యం
రైతులను అందిన కాడికి దోచుకుంటున్న దళారులు
తాము చెప్పిందే ధర, ఇచ్చిందే నగదు అంటూ బెదిరింపులు
75 కిలోల బస్తాకు రూ.430 కోత
ప్రభుత్వ మద్దతు ధర కరువు
ఇప్పటికే తుపాను కారణంగా 75 శాతం పైగా పంట కోల్పోయిన రైతులు
మద్దతు ధర కూడా దక్కకపోవడంతో గగ్గోలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు అండ
విపత్తుల సమయంలో రైతులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచింది. నష్టపోయిన ప్రతి రైతుకూ అదే సీజన్లో పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. వరి కోతలు ప్రారంభమయ్యే నాటికే రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించింది. మద్దతు ధరను సైతం క్వింటాల్‌కు రూ.145 వరకూ పెంచింది. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేయడం ద్వారా రైతుకు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకుంది.
తూకంలో మోసం
ధాన్యం తూకాల్లో సైతం మోసం చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం బస్తా 75 కిలోలకు తూకం సమయంలో సంచి తూకం అంటూ 2 కిలోలు, మట్టి తరుగు కింద మరో 2 కిలోలు, తేమ శాతం పేరిట 2 కిలోల వరకూ కోత పెడుతున్నారు. ఇవి కాకుండా ఎలక్ట్రానిక్ కాటాలో నాలుగైదు కిలోల వరకూ మోసం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద బస్తాకు 6 నుంచి 10 కిలోల వరకు దోచుకుంటుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు.


