గిరులు, తరులు.. భక్తజన ఝరులై.. | - | Sakshi
Sakshi News home page

గిరులు, తరులు.. భక్తజన ఝరులై..

Nov 25 2026 12:08 AM | Updated on Nov 25 2026 12:08 AM

అన్నవరం : కార్తిక పౌర్ణమి పర్వదినాన.. సత్యదేవుని గిరి ప్రదక్షిణ వేళ.. దారి పొడవునా గిరులు, తరులు భక్తజన ఝరులే అయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన ప్రవాహం ఆ మార్గంలో వెల్లువెత్తింది. ఎక్కడ చూసినా చీమలబారుల్లా భక్తజనమే కనిపించారు. ఉదయం 8 గంటలకు తిరుచ్చి వాహనం మీద, మధ్యాహ్నం 1.15 గంటలకు సత్యరథం మీద నిర్వహించిన ఈ గిరి ప్రదక్షిణలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. రత్నగిరివాసుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవారితో కలిసి భక్తుల కోసం కొండ దిగి వచ్చారు. ఉదయం 8 గంటలకు దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, గిరి ప్రదక్షిణ ప్రత్యేకాధికారి వి.త్రినాథరావు, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు కొబ్బరి కాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు వెంట రాగా గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది. భక్తులు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ అంటూ స్వామివారి నామం జపిస్తూ ముందుకు సాగారు. తొలి పావంచా నుంచి అన్నవరం మెయిన్‌ రోడ్డు మీదుగా బెండపూడి సమీపంలోని పుష్కర కాలువ వద్దకు, అక్కడి నుంచి పంపా తీరం వరకు మొత్తం 8.5 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు పంపా ఘాట్‌ వద్దకు చేరిన స్వామి, అమ్మవార్లకు పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రత్నగిరికి ఊరేగింపుగా తరలించారు.

దారంతా గడ్డి పరచడంతో..

గత ఏడాది అరకొర ఏర్పాట్లతో దారి పొడవునా చిన్నచిన్న గులకరాళ్లు పాదాలకు గుచ్చుకోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై అప్పట్లో ‘నడక యాతన’ శీర్షికన ‘సాక్షి’ వార్త ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఈఓ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈఈ రామకృష్ణ, ఇతర సిబ్బంది గిరిప్రదక్షిణ జరిగే దారంతా గడ్డి పరిచారు.

u దారి పొడవునా భక్తులకు మంచినీరు, మజ్జిగ, పండ్లు, పులిహోర పంపిణీకి దేవస్థానంతో పాటు పలు సంస్థలు 12చోట్ల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. స్థానికంగా కొత్తగా ప్రారంభమైన కార్పొరేట్‌ ఆసుపత్రి సిబ్బంది పలుచోట్ల వైద్య సేవలందించారు.

u పోలండ్‌కు చెందిన మిలోన్‌స్కీ కూడా సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సత్యదేవుడు, అమ్మవారితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అతడు చెప్పాడు.

u ఉదయం గిరి ప్రదక్షిణ సమయంలో కొంతసేపు వర్షం కురిసింది. లక్షలాదిగా భక్తులు ఆ వర్షంలో తడుస్తూనే ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

u గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు తొలి పావంచా వద్ద సుమారు 2 లక్షల కొబ్బరి కాయలు కొట్టారు.

u ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యాన సుమారు 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఫ వైభవంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణ

ఫ పాల్గొన్న 3 లక్షల మందికి పైగా భక్తులు

ఫ ఉదయం తిరుచ్చి వాహనం..

మధ్యాహ్నం ప్రచార రథంపై నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement