తుని: ఓ మహిళ బ్యాగ్‌ను మరిచిపోగా, తిరిగి ఆమెకు తుని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అప్పగించారు. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి జీఆర్పీ ఎస్సై వి.సత్తిబాబు కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా చిన్న గుమ్ములూరుకు చెందిన ఎర్ర దుర్గా అంబికాదేవి సికింద్రాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తుని రైల్వే స్టేషన్‌లో దిగింది. రెండో నంబరు ప్లాట్‌ఫామ్ నుంచి ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌కు వచ్చి టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద బ్యాగులు పెట్టింది. సామాన్లు తీసుకువెళ్లే సమయంలో హ్యాండ్ బ్యాగ్‌ను మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బుకింగ్ కౌంటర్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ తెరిచి చూడగా, అందులో 52 గ్రాముల బంగారు వస్తువులు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ.3,200 నగదుతో పాటు ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ ఉన్నాయి. ఆధార్‌కార్డులో చిరునామా ప్రకారం పోలీసులు ఫోన్ ద్వారా బాధిత మహిళకు సమాచారం అందించారు. ఆ బ్యాగ్‌ను దుర్గా అంబికాదేవికి అప్పగించడంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా
● ఇద్దరు భవానీలకు గాయాలు
అన్నవరం: సత్యదేవుని దర్శనానికి వస్తున్న భవానీ భక్తుల ఆటో శనివారం దేవస్థానం ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భవానీలకు గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రేవు పోలవరం శివారు గుడివాడకు చెందిన ఐదుగురు భవానీలు దీక్ష పూర్తి చేసుకుని, శనివారం సత్యదేవుని ఆలయానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో రత్నగిరి మొదటి ఘాట్ రోడ్డు రెండో మలుపులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భవానీలు సంజయ్, సురంధర్ గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే దేవస్థానం అధికారులు 108 ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి ప్రమాద స్థలానికి రప్పించి క్షతగాత్రులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


