రైతన్నలు కాడి కట్టి, మేడి పట్టి, నేల దున్నే సమయంలో.. పుడమి తల్లి గర్భంలో ఉన్న రకరకాల పురుగులన్నీ బయట పడుతూంటాయి. సరిగ్గా అదే సమయంలో ఎవరో కబురు చెప్పినట్లు.. ఆ పురుగులను కడుపారా ఆరగించేందుకు ఎక్కడెక్కడో ఉన్న కొంగలు.. రెక్కలు కట్టుకు వచ్చి మరీ వాలిపోతాయి. కోటనందూరు మండలం ఎల్‌డీ పేట వద్ద వరి నాట్లు వేసేందుకు రైతు ట్రాక్టర్‌తో దమ్ము చేస్తూండగా.. వందలాదిగా కొంగలు అలానే తరలి వచ్చాయి. దమ్ము చేస్తున్నంతసేపూ అక్కడే తిష్ట వేసి.. పురుగులను పట్టుకుని కడుపు నింపుకొన్నాయి. ‘ఒక జీవికి ఆకలి వేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే’ అంటూ ఓ సినీ కవి చంద్రబోస్ తన పాటలో చెప్పిన భావన ఇక్కడ అక్షరాలా ఆవిష్కృతమైంది.
– కోటనందూరు


