భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలన్నదే వారందరి లక్ష్యం. దాని సాధనకు ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు. కష్ట నష్టాలను ఓర్చుకుని పాఠాలు చదివారు. ఎన్నో ఆశలతో డీఎస్సీ పరీక్ష రాసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. ఉపాధ్యాయ పోస్టులను అంగడిలో సరుకుల్లా అమ్మేసింది. ఉద్యోగానికి వెలకట్టి, అనర్హులను అందలం ఎక్కించింది. దీంతో మోసపోయిన నిరుద్యోగులందరికీ వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. అర్హులకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రమైన కాకినాడలో నిరసన గళమెత్తింది.
పాలకుల తీరును ప్లకార్డుతో ప్రశ్నిస్తూ..
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, నిరుద్యోగులు బుధవారం కాకినాడలో కదం తొక్కారు. మెగా డీఎస్సీపై పూర్తిస్థాయి విచారణ చేయాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక డీ కన్వెన్షన్ నుంచి మెయిన్ రోడ్డులోని సూపర్ బజార్, మసీద్ సెంటర్ మీదుగా బాలాజీ చెరువు సెంటర్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకూ వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేల మంది యువజన, విద్యార్థి విభాగం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట రాంజీ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం హడావుడి చేసి, చివరకు నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అనేక అక్రమాలకు పాల్పడి, అనర్హులకు ఉద్యోగులు ఇచ్చిందన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. నీట్ పేపర్ లీకై న ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. అలాగే డీఎస్సీ లోపాలకు లోకేశ్ బాధ్యత వహించి, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులందరికీ అన్యాయం
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకై తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 15 రోజులు పోరాటం చేశారన్నారు. ఆ పోరాటంపై అనేక మంది చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారని, అయినప్పటికీ పోరాటం ఉధృతం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించిందన్నారు. డీఎస్సీలో అర్హులైన వారికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, డబ్బులు వసూలు చేసుకుని అక్రమంగా అమ్ముకున్నారని విమర్శించారు. నిజమైన వారికి ఉద్యోగాలు లేకుండా పోయాయన్నారు. అందుకే అర్హులైన వారందరూ రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారన్నారు.
హామీలిచ్చి మోసం
వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి పాఠశాలలోనూ ఇంగ్లిష్ మీడియం బోధనను తీసుకు వస్తే.. నేడు కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 900 పాఠశాలను మూసివేశారని, విద్యా దీవెన, వసతి దీవెన, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అరుణ్ కుమార్ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెబుతున్న చంద్రబాబు నాయుడు.. ఆయన అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి, ఒక సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. నిరసనలో యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంజీకే కిశోర్ కుమార్, యువజన విభాగం నాయకులు ఎం.రాజబాబు, దాసం వెంకటేష్, వీరంరెడ్డి నాని, సకురు గుర్రాజు, ఎం.దొరబాబు, ఉలవల భూషణం, కరణం భాను, వేల మంది కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
నిరుద్యోగ భృతి ఏమైంది?
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఉద్యోగ ప్రకటనలు రాక నిరుద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని తోట రాంజీ అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3 వేలు ఇస్తామని ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో విద్యార్థులు కష్టాలు పడుతున్నారన్నారు.
అంగడిలో పోస్టుల విక్రయం
స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడి ఒక్కొక్క పోస్టును రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు అమ్ముకున్నారని రాగిరెడ్డి అరుణ్ కుమార్ విమర్శించారు. క్రీడల్లో బంగారు పతకాలు గెలుచుకున్న అభ్యర్థులకు కాదని, అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు తీసుకువచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. లంచాలు ఇచ్చి, ఉద్యోగాలు సాధించిన వారు పిల్లలకు పాఠశాలల్లో ఏమి బోధన చేస్తారని ప్రశ్నించారు. పాలకులు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి దోచుకుతింటున్నారన్నారు. అధికారంలోకి వస్తే ప్రశ్నిస్తామని ఎన్నికల ముందు చెప్పిన నాయకులు ప్రస్తుతం ప్రశ్నించటాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని అడిగిన యువకులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు.
కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
డీఎస్సీ అక్రమాలపై
విచారణ నిర్వహించాలి
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
కాకినాడలో భారీ ర్యాలీ
తరలివచ్చిన నిరుద్యోగులు, యువత


