ఎన్నికల సమయంలో కల్లబొల్లి హామీలు ఇచ్చారు.. బాబు వస్తే జాబ్ అన్నారు.. లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ నమ్మించారు.. ఇలా మాయమాటలు చెప్పి ‘కూటమి’గా ఏర్పడి అధికార పగ్గాలు చేపట్టారు. రెండేళ్లు దాటినా రిక్తహస్తమే చూపుతున్నారు.. యువతను నిలువునా దగా చేస్తున్నారు.. అలాగే ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కనబెట్టేశారు.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై విసుగు చెందిన యువతకు బాసటగా మంగళవారం జిల్లా కేంద్రం కాకినాడలో వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట జరుగనుంది.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఎన్నికల్లో హామీలు ఇవ్వడం.. ఆనక దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 2014 ఎన్నికల ప్రచార సభలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తానని.. లేకుంటే రూ.మూడు వేల చొప్పున నెలకు భృతి ఇస్తామని చంద్రబాబు నమ్మించారు. ఈ మాటలు నమ్మి అనేకమంది నిరుద్యోగులు ఓటు వేశారు. కానీ రెండేళ్లు దాటినా ఉద్యోగం లేకపోగా, కనీసం భృతి అయినా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల ఉన్నత చదువుకు ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రెండేళ్లుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో సుమారు 5 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఈ రెండేళ్లలో వారికి ఒక ఉద్యోగం కూడా రాలేదు. ఈ లెక్కన చంద్రబాబు ఇంటికొక నిరుద్యోగికి రూ. 3 వేలు భృతి చెల్లిస్తే, రెండేళ్లలో రూ.3,600 కోట్లు అందించాల్సి ఉంటుంది. దానికీ అతీగతి లేదు.
జిల్లాలో మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు, ఇంజినీరింగ్, ఐటీఐ కళాశాలలు 86 ఉన్నాయి. ఇందులో సుమారు 1,960 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. ఈ రెండేళ్లలో వారికి రూ.72.59 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. లేకుంటే పరీక్షలు రాయకుండా హాల్ టికెట్లు నిలిపివేస్తున్నాయి. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది.
నేడు కాకినాడలో పోరుబాట
డీఎస్సీ నియామకాలపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం కాకినాడలో వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కాకినాడ సిటీ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీ పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు తోట రాంజీ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంజీకే కిశోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువత, విద్యార్థుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వాపోయారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. వేలాది మంది విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం నిర్వహించే భారీ నిరసన ర్యాలీలో పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ డీకన్వెన్షన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా, బాలాజీచెరువు సెంటర్‌లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకూ ఈ ర్యాలీ సాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం కాకినాడ రూరల్ అధ్యక్షుడు మామిడాల గౌతమ్‌తేజ, నాయకులు పూసల అనిల్, గన్నవరపు రాజేష్, యసలపు పవన్, మిడిమళ్ల కుమార్, సూర్యకాంత్, సాయిపవన్, మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.
గతమెంతో ఘనం
ప్రజా సంకల్ప యాత్ర సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక మంది యువత కష్టాలు చూశారు. నిరుద్యోగ సమస్యను పారద్రోలాలని భావించారు. అధికారంలోకి వచ్చాక అనుకున్నదే తడవుగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 620 గ్రామ వార్డు సచివాలయాల్లో 534 మంది నిరుద్యోగులను సచివాలయ ఉద్యోగులుగా నియమించారు. అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను కల్పించారు. ఇదిలా ఉంటే నేడు జాబ్ క్యాలెండర్ లేక, నిరుద్యోగ భృతి అందక, ఉన్నత చదువులు చదివిన యువత పొరుగు రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీలు చదివిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు లేక హైదరాబాద్, బెంగళూర్, చైన్నె తదితర రాష్ట్రాలకు పొట్టచేత పెట్టుకుని వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగాలు లేక చాలామంది వయసు దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువత, విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఫ ఎన్నికల హామీలు బుట్టదాఖలు
ఫ రెండేళ్లుగా ఉద్యోగం లేదు..
భృతి రాదు
ఫ ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలు రూ.72. 59 కోట్లు
ఫ నేడు వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన
విభాగం ఆధ్వర్యాన పోరుబాట


