నీతి, నిజాయితీకి ప్రతీక ‘ముద్రగడ’ | - | Sakshi
Sakshi News home page

నీతి, నిజాయితీకి ప్రతీక ‘ముద్రగడ’

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

నీతి, నిజాయితీకి ప్రతీక ‘ముద్రగడ’

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధతకు ప్రతీకగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిలిచారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో సోమవారం కన్నబాబు అధ్యక్షతన ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమన్వయకర్తలు హాజరై ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ముద్రగడ నిష్కలంక రాజకీయవేత్తగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ముద్రగడ ఉద్యమశక్తిగా ఎదిగినా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు. మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పేరొందారని అన్నారు. మాజీ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ, ఉత్తర కంచి దీక్షతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ముద్రగడ దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, ముద్రగడ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎంతో మంచి అనుబంధం ఉందని, ఆయన మరణం పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు తీరని లోటని భావోద్వేగంతో తెలిపారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దవులూరి దొరబాబు మాట్లాడుతూ, రాజకీయాల్లో ముద్రగడ లాంటి విలువలకు కట్టుబడి పనిచేసే నాయకులు ఎంతో అరుదుగా ఉంటారని అన్నారు. ఈ సంతాప సభలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, స్మార్ట్‌ సిటీ మాజీ చైర్మన్‌ అల్లి రాజబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, మాకినీడి శేషుకుమారి, కుమార్‌ రాజా పాల్గొన్నారు.

1న కిర్లంపూడిలో సభ

వచ్చే నెల 1న కిర్లంపూడిలో నిర్వహించ తలపెట్టిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కురుసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.

సీఎం వ్యాఖ్యలపై మండిపాటు

ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ శ్రేణులు ఈ సభలో పాల్గొనవద్దని వ్యాఖ్యానించడంపై వైఎస్సార్‌ సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ ముద్రగడను ఒక వర్గ శత్రువుగా చూడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగదని అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ‘జీవించి ఉన్నంతకాలం ముద్రగడపై కక్ష సాధించారు, ఇప్పటికై నా ఆయనపై రాజకీయాలు చేయడం మానుకోండి’ అని హితవు పలికారు.

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement