ప్రచారం చూస్తే ఆహా.. ఓహో! | - | Sakshi
Sakshi News home page

ప్రచారం చూస్తే ఆహా.. ఓహో!

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

కాకినాడ రూరల్‌: రాష్ట్ర అభివృద్ధి ప్రచారంలో చంద్రబాబు ఆహా ఓహో అంటారని.. కాగ్‌ రిపోర్టు చూస్తే అసలు రంగు బహిర్గతమైందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కాగ్‌ నివేదికలు, రాష్ట్ర ప్రగతి చూసినప్పుడు చంద్రబాబు ఫెయిల్యూర్స్‌తో కనీసం పాస్‌ మార్కులు కూడా తెచ్చుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అప్పుల్లో అగ్రస్థానం, అభివృద్ధిలో అథమ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రానికి 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాయని, 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చంద్రబాబు, లోకేష్‌లు కలసి అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారు. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వం వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిందన్నారు. రాష్ట్రానికి రూ.6,962 కోట్లు మాత్రమే రెండేళ్లలో పెట్టుబడులు వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్‌లో ప్రకటించిందని కన్నబాబు చెప్పారు. 23 లక్షల ఉద్యోగాలు కూడా డొల్ల అని తేలిపోయిందన్నారు. డీపీఐఐ ఇన్వెస్ట్‌ ఇండియా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లలో కేవలం పది ప్రాజెక్టులు మాత్రమే వచ్చాయని, వీటి విలువ పెట్టుబడి రూ.6,962 కోట్లని కేంద్రం చెప్పిందన్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో 22,162 ఉద్యోగాలు లభించనున్నాయని, 10 ప్రాజెక్టుల్లో ఇప్పటికి రెండు మాత్రమే పూర్తయ్యాయని వివరించారు. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి? ఏ జిల్లాకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఏ జిల్లాలో ఏ పరిశ్రమ నిర్మాణం చేపట్టారు? మొత్తం పెట్టుబడులు ఎంత? ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఇవ్వాల్సినవి ఎన్ని? అని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని కన్నబాబు అన్నారు. చంద్రబాబు రోజుకు సగటున రూ.492 కోట్ల అప్పు తెస్తున్నారని తెలిపారు. ఇప్పటికి రెండేళ్లలో రాజధాని, బడ్జెట్‌ లోపల, బయట అన్నీ కలిపి రూ.3.59,157 కోట్ల అప్పులు చేశారన్నారు.

రైతులను ఆదుకోరా!

ఎల్‌నినో ప్రభావం ఉందని రైతులను వరి వేయవద్దని చంద్రబాబు చెబుతున్నారని, గోదావరి, కృష్టా డెల్టా పరిధిలో వరి తప్ప మరో పంట వేయలేని లక్షలాది ఎకరాలు ఉన్నాయని కన్నబాబు అన్నారు. క్రాప్‌ హాలిడే ప్రకటిస్తారా, ప్రకటిస్తే ఎకరాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారని నిలదీశారు. పోని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఇచ్చారా ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై ఇస్తామని చెబుతున్నారా అని ప్రశ్నించారు.

సొంత ఆదాయంలో 22వ స్థానానికి..

సొంత ఆదాయంలో మన రాష్ట్రం 22వ స్థానానికి పడిపోయిందని కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో 4,520 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని చెప్పారు. మూతపడిన పరిశ్రమల ద్వారా 48,477 ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని, మీరు తెస్తామన్న ఉద్యోగాలు 22,167 పోగా ఇంకా 36,310 ఉద్యోగాల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇన్వెస్టర్‌ ఫ్రెండ్సీ ఇండెక్స్‌లో నంబరు వన్‌ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయిందన్నారు. రెడ్‌బక్‌ వేధింపులు భరించలేక సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయాయన్నారు. ఆ రోజు వైఎస్‌ జగన్‌ ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీగా ఉండడంతోనే పెట్టుబడులు వచ్చాయన్నారు. శాంతిభద్రతల్లో 26వ స్థానంలో ఉన్నామని, మీకు సిగ్గు ఉందా అని కన్నబాబు నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలపై విచారణను సీబీఐకి ఇవ్వండంటే మాట్లడడం లేదని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలన్నారు.

ముద్రగడ వర్గ శత్రువా?

ముద్రగడ పద్మనాభం వర్గ శత్రువా.. రాజకీయాల్లో మానవ సంబంధాలు ఉండవా అని చంద్రబాబును కన్నబాబు నిలదీశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు సంస్మరణ, సంతాప సభలకు వెళితే మహా ఘోరంగా చిత్రీకరిస్తున్నారంటే చంద్రబాబు నిజస్వరూపం తెలిసిపోయిందన్నారు.

ఫ కాగ్‌ రిపోర్టుతో అసలు రంగు బహిర్గతం

ఫ అథమ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు

ఫ మాజీ మంత్రి కురసాల కన్నబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement