ఎస్సై సమయ స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

ఎస్సై సమయ స్ఫూర్తి

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

కోటనందూరు: ఓ భక్తుడిని కాపాడడంలో ఎస్సై సమయ స్ఫూర్తిని ప్రదర్శించారు. తలుపులమ్మ లోవ దేవస్థానంలో ఆదివారం కోటనందూరు ఎస్సై టి.రామకృష్ణ విధులు నిర్వహించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి తలుపులమ్మను దర్శించుకునేందుకు భార్యతో కలసి ఓ భక్తుడు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో గుండెపోటు రావడంతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. పక్కనే విధి నిర్వహణలో ఉన్న ఎస్సై స్పందించి కుప్పకూలిన భక్తుడికి సీపీఆర్‌ చేశారు. కొద్ది క్షణాలకు ఆ భక్తుడు శ్వాస తీసుకోవడంతో 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆసుపత్రికి తలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో భక్తుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఎస్సై రామకృష్ణ స్పందించిన తీరు, ప్రదర్శించిన సమయ స్ఫూర్తికి పోలీసు ఉన్నతాధికారులతో పాటు భక్తులు, స్థానికులు ప్రశంసించారు.

రేపటి నుంచి వరుణ యాగం

అన్నవరం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణమి) బుధవారం నుంచి వరుణ యాగం నిర్వహించనున్నట్లు దేవస్థానం అఽధికారులు తెలిపారు. దేవస్థానంలోని దర్బారు మండపంలో వరుణ యాగానికి అంకురార్పణ చేస్తారు. రుష్యశృంగుని విగ్రహంతో ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణ నిర్వహిస్తారు. అదే విధంగా కొండ దిగువన పంపా నదిలో కూడా రుత్విక్కులు వరుణ జపాలు చేస్తారు. గురువారం కూడా వరుణ యాగం, జపాలు కొనసాగించి శుక్రవారం రత్నగిరిపై పూర్ణాహుతి నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.

జాడలేని ఓటర్లు 21,604

పెద్దాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలో జాడలేని ఓట్లు 21,604గా అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలో పెద్దాపురం రూరల్‌లో 58 పోలింగ్‌ బూత్‌లో 61,056 ఓట్లు ఉండగా, అందులో 56,533 ఓట్లు మ్యాపింగ్‌ అయ్యాయి. పెద్దాపురం అర్బన్‌లోని 37 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 41,714 ఓట్లు ఉండగా, 37,582 మందికి మ్యాపింగ్‌ జరిగింది. సామర్లకోట రూరల్‌లో 69 బూత్‌ల పరిధిలో 71,261 ఓటర్లకు గాను 63,413 ఓటర్ల మ్యాపింగ్‌ చేశారు. సామర్లకోట అర్బన్‌లో 37 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 43,971 ఓటర్లు ఉండగా, 38,867 ఓటర్లు మ్యాపింగ్‌ అయ్యినట్టు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 201 పోలింగ్‌ బూత్‌లలో 2,18,002 ఓటర్లు ఉండగా, 1,96,398 ఓట్లను డిజిటలైజేషన్‌ చేశారు. నియోజకవర్గంలో 9,192 మంది ఓటర్లు చనిపోయినట్టు, 5,395 మంది వలస వెళ్లినట్లు, డూప్లికేట్‌ ఓటర్లుగా 3,911 మందిని గుర్తించారు. అసలు ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకోని వారు 3,091 మంది ఉన్నారు.

దస్తావేజు లేఖర్ల నిరసన

కాకినాడ లీగల్‌: దస్తావేజు లేఖర్ల వృత్తికి భంగం కలిగించే జీఓ నంబరు 396ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలోని 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీజే ప్రసాద్‌, చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ ఆ జీఓతో రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement