ఫ రూ.20 లక్షల విలువైన
బంగారు ఆభరణాల రికవరీ
ఫ పెద్దాపురం డీఎస్పీ తిలక్
సామర్లకోట: బస్సుల్లో ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి చోరీకి పాల్పడుతున్న ఇద్దరు బ్యాగ్ లిఫ్టర్లను పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని విచారించగా వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ ఏజీబీ తిలక్ చెప్పారు. డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. ఏప్రిల్ 30న పి.లక్ష్మి బస్సులో ప్రయాణిస్తుండగా తన బ్యాగ్‌లో బంగారు ఆభరణాలు చోరీకి గురయినట్లు పెద్దాపురం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అలాగే ఎం.రేఖ మే ఒకటిన విశాఖపట్నంలో బస్సెక్కి కాకినాడలో దిగి బ్యాగ్‌లో పెట్టుకున్న బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు కాకినాడ టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రెండు కేసులను దర్యాప్తు ప్రారంభించగా మంగళవారం పాండవుల మెట్ట వద్ద అనుమానంగా తిరుగుతున్న గుంజ గిడ్డన్న, తమ్మిశెట్టి వాణి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని విచారించి వారి వద్ద నుంచి 174 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని తెలిపారు. సమావేశంలో సీఐలు, ఎస్సై పాల్గొన్నారు.


