● పామాయిల్ తోటలో మకాం
● పొలాల్లో ప్రత్యేక బృందాల
రెస్క్యూ ఆపరేషన్
దేవరపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు కొంత కాలంగా దడ పుట్టిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల మధ్య పొలాలకు చేరుకుంది. సోమవారం మండలంలోని కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్టు పాదముద్రల ద్వారా గుర్తించిన అటవీ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీ శాఖ రాజమహేంద్రవరం రేజ్ అధికారి దావీద్ రాజు ఆధ్వర్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. 60 మంది సిబ్బందిని 5 బృందాలుగా పంపి గాలింపు చేపట్టారు. పులి మెడలోని ట్రాకర్ ద్వారా దాని కదలికలను గమనిస్తున్నారు. మంగళవారం ఉదయం నందిగూడెం అటవీ ప్రాతం నుంచి తొక్కిరెడ్డిగూడెం మీదుగా కరిచర్లగూడెం బొల్లేరు చెరువు సమీపంలోకి చేరుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆవుదూడను చంపి సమీపంలోని కొబ్బరి, కోకో, ఆయిల్‌పామ్ తోటల్లోకి లాక్కెళ్లినట్టు గుర్తించిన అధికారులు తోటను చుట్టిముట్టి అక్కడ బోను ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్, డ్రోన్ సహాయంతో పులిని పట్టుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. దీని కోసం శ్రీశైలం టైగర్ టీం, జిల్లా హనుమాన్ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు.


