చింతూరు: అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. చింతూరు మండలం సింగన్నగూడెంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చింతూరు మండలం ఎర్రంపేటలో ఇంటి నిర్మాణ పని కోసం భద్రాచలం నుంచి 10 మంది కూలీలు వ్యాన్‌లో బయలుదేరారు. వారి వాహనం సింగన్నగూడెం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి 30పై పశువులు అడ్డుగా వచ్చాయి. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తా పడడంతో దానిలో పది మంది కూలీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో వర్సా వీరభద్రం, రాములమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలానికి రిఫర్ చేశారు.


