అర్ధరాత్రి పెను విషాదం | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి పెను విషాదం

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

సామర్లకోట: అది సామర్లకోట – కాకినాడ రహదారి. సోమవారం అర్ధరాత్రి సమయం. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో కంటైనర్‌, ట్రాలీ ఎదురుపడ్డాయి. కంటైనర్‌లో మోటారు సైకిళ్లు, ట్రాలీపై భారీ యంత్ర పరికరం రవాణా అవుతున్నాయి. అయితే ట్రాలీపై యంత్ర పరికరానికి ఉన్న భారీ ఇనుప రాడ్డులు కంటైనర్‌ను చీల్చుకుంటూ పోయాయి. ఈ ఘటనలో కంటైనర్‌ డ్రైవర్‌ సీటులోనే మృతి చెందాడు. సీఐ ఎ.కృష్ణభగవాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని మధురై నుంచి కాకినాడ యమహా షోరూమ్‌కు కొత్త మోటారు సైకిళ్ల (యమహా ఎఫ్‌జెడ్‌)ను కంటైనర్‌ తీసుకువస్తోంది. అలాగే కాకినాడ పోర్టు నుంచి రాజమహేంద్రవరం వైపునకు ఓ భారీ యంత్ర పరికరాన్ని ట్రాలీ తీసుకువెళుతున్నారు. ఆ భారీ యంత్ర పరికరానికి చివర నలువైపులా పొడవైన ఇనుప కడ్డీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామర్లకోట– కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయర్‌ వద్ద కంటైనర్‌, ట్రాలీ ఎదురుపడ్డాయి. ముందుకు సాగు క్రమంలో కంటైనర్‌ డ్రైవర్‌ ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు ట్రాలీలోని యంత్ర పరికరానికి ఉన్న ఇసుక కడ్డీలు చీల్చుకుంటూ పోయాయి. ఈ ప్రమాదంలో కంటైనర్‌ సగం భాగం రెండుగా చీలిపోయింది. డ్రైవింగ్‌ సీటులో ఉన్న డ్రైవర్‌ షేర్‌ సింగ్‌ (45) అక్కడిక్కడే మృతి చెందాడు. రెండు భారీ వాహనాలు ఎదురు కావడం, చెట్ల కొమ్మలు తగ్గిలే అవకాశం ఉందని, రోడ్డు మార్జిన్‌ విడిచి వేగంగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో వెనుక వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ట్రాలీని సామర్లకోట సుగర్‌ ఫ్యాక్టరీ యార్డులోకి తరలించారు. ధ్వంసమైన కంటైనర్‌ను రోడ్డు మార్జిన్‌లోకి తీసుకువెళ్లారు. మోటారు సైకిళ్ల షోరూమ్‌ యజమానులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, మరో కంటైనర్‌లో మోటారు సైకిళ్లు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎ.కృష్ణభగవాన్‌ తెలిపారు.

ఫ ప్రమాదానికి కారణమైన

ట్రాలీపై యంత్ర పరికరం

ఫ కంటైనర్‌ను చీల్చుకుంటూ

వెళ్లిపోయిన వైనం ఫ డైవర్‌ మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement