లోవ ప్రాంగణంలో కొండచిలువల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

లోవ ప్రాంగణంలో కొండచిలువల హల్‌చల్‌

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

తుని రూరల్‌: తలుపులమ్మ లోవ ప్రాంగణంలో కొండచిలువలు హల్‌చల్‌ చేశాయి. వాటిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమ్మవారి కొండ దిగువన ఉన్న పాకల వద్దకు సోమవారం మధ్యాహ్నం కొండచిలువ వచ్చింది. దాన్ని స్థానికులు గుర్తించి వెంటనే లోవ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. రాజు, సత్తిబాబు అనే ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని 15 అడుగులకు పైగా పొడవున్న కొండచిలువను పట్టుకున్నారు. ఈ క్రమంలో అది అటు ఇటూ తిరుగుతూ భక్తులను బెంబేలెత్తించింది. సిబ్బంది దాన్ని పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. అలాగే రోజు రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి పది అడుగుల పొడవుగల మరో కొండ చిలువ రాజగోపురం మెట్లు దిగుతూ కనిపించింది. వెంటనే దీన్ని సైతం పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇలా ఒకే రోజు రెండు కొండ చిలువలు కనిపించడం, జూన్‌ రెండో తేదీన కూడా పాకల వద్ద ఓ కొండ చిలువ సంచరించడంపై ఆందోళన నెలకొంది. కాగా.. ఆహారం ఆఽన్వేషణ, వాతావరణ మార్పులతో కొండ చిలువలు బయటకు వస్తున్నాయని, ఎవరైనా గమనిస్తే సమాచారం ఇవ్వాలని, కనీసం పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలని తుని ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement