సామర్లకోట: బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద, పంచాయతీ కార్యాలయంలో కూర్చుని ఫారాలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగ నాయకులు ఆరోపించారు. కొందరు బీఎల్వోలు పంచాయతీ కార్యాలయంలో ఫారాలు ఇస్తారని మైక్ ద్వారా ప్రచారం చేయడంతో అనేక మంది అక్కడకు వెళ్లి ఫారాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని పార్టీల నాయకుల బూత్ లెవెల్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా, వైఎస్సార్ సీపీ ఏజెంట్లకు మాత్రం సమాచారం ఇవ్వడం లేదన్నారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన సర్ సర్వే కార్యక్రమం ఏకపక్షంగా కొనసాగుతోందన్నారు. ఫారాల పంపిణీపై బీఎల్వోను ప్రశ్నిస్తే ఇళ్ల చిరునామాలు తెలియకపోవడంతో ఒక చోట ఉండి పంపిణీ చేస్తున్నామంటూ సమాధానం ఇస్తున్నారని తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకుల చేతుల మీదుగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సోమవారం మేడపాడులో ఎమ్మెల్యే చినరాజప్ప, టీడీపీ నాయకులు ఫారాలు పంపిణీ చేశారని రంగనాయకులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా జి.మేడపాడులో నలుగురు బీఎల్వోలు ఉన్నారని, మండల పరిధిలో బీఎల్వోలతో సమావేశమై నిబంధనలు తెలియజేస్తానన్నారన్నారు.


