కొండబాబుకు ఇంటి పోరు | - | Sakshi
Sakshi News home page

కొండబాబుకు ఇంటి పోరు

Apr 21 2026 3:56 AM | Updated on Apr 21 2026 3:56 AM

పదవి ఇచ్చి చిచ్చు పెట్టిన చంద్రబాబు

ఎమ్మెల్యే అన్న కోడలు

సుస్మితకు పార్టీ పదవి

పోటీగా పదవి కట్టబెట్టడంపై

ఎమ్మెల్యే వర్గం కినుక

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నగర టీడీపీలో అన్నదమ్ముల మధ్య వార్‌ నువ్వా నేనా అనే స్థాయికి చేరుకుంది. సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. పార్టీపై పట్టు బిగించేందుకు అన్నయ్య వనమాడి సత్యనారాయణ తగ్గేదే లేదంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇన్నాళ్లూ సిటీ టీడీపీలో చాప కింద నీరులా ఉన్న ఆధిపత్య పోరు ఇటీవల రోడ్డెక్కింది. అధిష్టానం కూడా ఎమ్మెల్యే కొండబాబుకు సరితూగే రీతిలో ఆయన అన్నయ్య సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తోంది. రెండు రోజుల క్రితం అధినాయకత్వం ప్రకటించిన పదవుల్లో సత్యనారాయణ కోడలు సుస్మితను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడమే దీనికి నిదర్శనమని అంటున్నారు. కొండబాబు రాజకీయంగా ఈ స్థాయికి రావడం వెనుక సత్యనారాయణ కృషిని గుర్తించే సుస్మితకు పార్టీలో అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ పరిణామంతో భవిష్యత్‌లో కొండబాబుకు సత్యనారాయణ కుటుంబం రాజకీయంగా ఏకు మేకయ్యే ప్రమాదం లేకపోలేదని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా సుస్మితకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టడంపై కొండబాబు కినుక వహించారు.

గత ఎన్నికల నుంచే..

వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి తన కుమారుడు, మాజీ కార్పొరేటర్‌ ఉమాశంకర్‌కు టీడీపీ టికెట్టు దక్కించుకునేందుకు సత్యనారాయణ గట్టి ప్రయత్నమే చేశారు. నాడు పార్టీ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో సైతం ఆయనకు అంతా సానుకూలంగా ఉందనే ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో జరిగిన సీట్ల సర్దుబాటులో జనసేన మొదట కాకినాడ సిటీకే మొగ్గు చూపింది. మత్స్యకార సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో దీనిని ఎంపిక చేసుకోవాలని ఆలోచించింది. ఆ సామాజిక వర్గానికే ఉమాశంకర్‌ పేరు అప్పట్లోనే పరిశీలనకు వచ్చిందనే ప్రచారం కూడా నడిచింది. నాడు సీట్ల సిగపట్లు మొదలైనప్పటి నుంచీ అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేచింది. కొండబాబు తన టికెట్టు కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నప్పుడే తన తనయుడు ఉమాశంకర్‌కు కూడా అవకాశం ఇవ్వాలంటూ సత్యనారాయణ తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఇంటా బయటా చర్చనీయాంశమయ్యాయి. దీనిని కొండబాబు సహా కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా పరిగణించారని అప్పట్లో పార్టీలో విస్తృత చర్చే జరిగింది. చివరిలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణల్లో కొండబాబుకే సీటు దక్కింది. సత్యనారాయణ వర్గం కూడా ఆయనకే పని చేయడాన్ని గుర్తించే తాజాగా పదవుల పందేరంలో ఆయన కోడలికి ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు.

‘సానా’ ఆశీస్సులు!

ఉమాశంకర్‌కు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటున్నారు. కొండబాబుకు అన్నీ తానై పార్టీని భుజాన మోసినా సత్యనారాయణకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే విషయాన్ని సతీష్‌ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సుస్మితకు ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. సిటీ టీడీపీలో కొండబాబుకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలకు మిగిలి ఉన్న మూడేళ్ల కాలంలో రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

సై అంటే సై

ఎన్నికల అనంతరం సిటీ టీడీపీలో కొండబాబు, సత్యనారాయణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. వారిద్దరి కుటుంబాల మధ్య మాటామంతీ కూడా లేదనే చెబుతున్నారు. తమను, తమ వర్గాన్ని కొండబాబు పూర్తిగా విస్మరించారని సత్యనారాయణ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో ఇరు వర్గాలూ పోటాపోటీగా తమ చేతల ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఉమాశంకర్‌ పుట్టిన రోజు సందర్భంగా నగరమంతటా హోర్డింగ్‌లు పెట్టి, రాజకీయాల్లో సై అంటూ కొండబాబుతో కాలు దువ్వారు. ఇందుకు పోటీగా ఎమ్మెల్యే తనయుడు మోహన్‌వర్మ.. అమరావతికి చట్టబద్ధతపై ర్యాలీలు, సంబరాలతో ప్రతి సవాల్‌ విసిరారు. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వాతావరణం ఇక్కడి టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా సుస్మితకు పదవి ఇవ్వడాన్ని స్వాగతిస్తూ నగరంలోని ముఖ్య కూడళ్లలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఎమ్మెల్యే కొండబాబు ఫొటోకు చోటు దక్కక పోవడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండబాబును బాహాటంగానే వ్యతిరేకిస్తున్న సత్యనారాయణ కోడలు సుస్మితకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. సత్యనారాయణకు ప్రాధాన్యం ఇవ్వడమంటే కొండబాబుకు పక్కలో బల్లెమేనంటూ ముందస్తు సంకేతాలు పంపించడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement