గుక్కెడు నీళ్లివ్వండి | - | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీళ్లివ్వండి

Apr 21 2026 3:56 AM | Updated on Apr 21 2026 3:56 AM

సత్యవరపుపేట దళితుల ఆందోళన

వివక్ష వీడాలని నినాదాలు

కాకినాడ వెళ్లి కలెక్టర్‌కు వినతి

సామర్లకోట: తాగడానికి గుక్కెడు నీళ్లందించాలని డిమాండ్‌ చేస్తూ వీకే రాయపురం శివారు సత్యవరపుపేట ప్రజలు సోమవారం ఆందోళన నిర్వహించారు. సత్యవరపుపేట నుంచి కాలిబాట వంతెన మీదుగా ప్రధాన గ్రామం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీళ్లివ్వండి – ప్రాణాలు కాపాడండి, దళితులపై వివక్షతన విడనాడండి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తాగునీటి కోసం సత్యవరపుపేట ప్రజలు 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. దీంతో, తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాలని బాధిత ప్రజలు నిర్ణయించుకున్నారు. మండే ఎండలో 10 ఆటోలు, మోటారు సైకిళ్లపై సుమారు 200 మంది కాకినాడ కలెక్టరేట్‌కు బయలుదేరారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, గుక్కెడు నీళ్లు అడుగుతున్నామని చెప్పారు. గ్రామానికి తాగునీరు సరఫరా చేసే బోర్లు మొరాయించడం, కలుషిత జలాలు వస్తూండటంతో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రతరమైందని తెలిపారు. అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. జలజీవన్‌ మిషన్‌ బోరు నుంచి కూడా కలుషిత జలాలు వస్తున్నాయని చెప్పారు. బోర్లు పని చేయని సమయంలో ఉదయం, సాయంత్రం కనీసం రెండు చొప్పున వాటర్‌ ట్యాంకర్లను కూడా అధికారులు ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి గ్రామంలో బోరు తవ్వితే సుద్ద నీరు వస్తోంది. సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని ఉండూరు రోడ్డులో మూడు బోర్లు తవ్వి ఇప్పటి వరకూ తాగునీరు సరఫరా చేసేవారు. ఆ బోర్లు పాడైపోవడంతో సమస్య తీవ్రతరమైంది. సుమారు 2 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన పైపులైన్‌ తరచూ లీకవుతోంది. ఫిల్టర్‌ బెడ్‌ను నిర్వహణలోకి తీసుకురావడం ఒక్కటే దీనికి పరిష్కారమని గతంలోనే ‘సాక్షి’ సూచించింది. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే దీని నిర్వహణ పంచాయతీకి భారమవుతుందనే వాదనలున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తుల తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేంత వరకూ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామంటూ కలెక్టర్‌ హామీ ఇచ్చారని సత్యవరపుపేట వాసులు విలేకర్లకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement