కూటమి పాలనలో మహిళలపై వేధింపులు
● మాజీ హోం మంత్రి తానేటి వనిత
దేవరపల్లి: కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెరిగాయని, జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారమే దీనికి నిదర్శనమని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైల్వేకోడూరు మహిళను శారీరకంగా, మానసికంగా వేధించిన ఎమ్మెల్యే శ్రీధర్‌ను జనసేన నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. ఇన్ని జరుగుతున్నా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వాపోయారు. రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ ఎన్నో కష్టాలను తట్టుకుని, ఇబ్బందులను ఓర్చుకుని, బెదిరింపులను దాటుకుని.. తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో విడుదల చేసిందన్నారు. కానీ ఇంత వరకూ హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.
స్పందించని పవన్
లైంగిక దాడులకు పాల్పడితే తాట తీస్తామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తానేటి వనిత ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఓ వివాహితను దారుణంగా వేధించి, దౌర్జన్యానికి తెగబడడం బాధాకరమన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చేస్తున్న ఇబ్బందికరమైన సంఘటనలను ఖండించి, ఎవరైతే జనసేన నాయకుల వల్ల ఇబ్బంది పడ్డారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాలా రక్షణ లభించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై ఆ పార్టీల నాయకులు స్పందించడం లేదన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ ఓ ప్రభుత్వ ఉద్యోగి మహిళని వేధించగా ఆమె బయటకు వచ్చి చెప్పిందన్నారు. కానీ సతీష్‌పై చర్యలు తీసుకోకపోగా, బాధిత మహిళపైనే కేసు పెట్టడం విచిత్రమన్నారు.
వాడపల్లిలో సీల్డ్ టెండర్లు
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో షామియానా ఏర్పాటు, వివిధ దుకాణాల నిర్వహణకు బుధవారం సీల్డ్ టెండర్లు నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేసే హక్కుకు, అలాగే శ్రీనివాస ప్రాంగణంలో రెండు తాత్కాలిక షాపులకు (మూడేళ్ల కాలపరిమితి), లడ్డూ బాక్సులు సరఫరా చేసే హక్కుకు ఈ టెండర్లు నిర్వహించారు. లడ్డూ బాక్సులకు సంబంధించి ఒకటిని రూ.3.98కి సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన విజయవాడకు చెందిన మణికంఠ ఏజెన్సీకి ఖరారు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మన సాయి ప్రసాద్, శిష్టా సూర్య కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు జనార్దనస్వామి కల్యాణం
ధవళేశ్వరం: గ్రామంలోని ధవళగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ జనార్దనస్వామి వారి కల్యాణం గురువారం రాత్రి 8.30 గంటలకు జరగనుంది. అంతకముందు తెల్లవారుజామున 3 గంటలకు విశేష అర్చనలు, ఉదయం 11.45 గంటలకు రథ సంప్రోక్షణ చేస్తారు. స్వామివారి రథోత్సవాన్ని మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభించనున్నారు. రథం వీధి నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఫిబ్రవరి 2వ తేది వరకు స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ దాసరి చిన్న రమణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి జోగి వెంకటేశ్వరరావు తెలిపారు.
కూటమి పాలనలో మహిళలపై వేధింపులు


