రూ.కోటితో అభివృద్ధి పనులు
● అన్నవరం ఆలయ ట్రస్టుబోర్డు నిర్ణయం
● రూ.40 లక్షల వ్యయంతో
రెండో మెట్ల దారి వద్ద ఆర్చి
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రూ.కోటి వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని దేవస్థానం పాలకమండలి తీర్మానించింది. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఏకసభ్య పాలకమండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈఓ వేండ్ర త్రినాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముఖ్యమైన తీర్మానాలు
● కొండ దిగువన మొదటి ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మించేందుకు, మెట్లకు ఇరువైపులా పిట్టగోడ, భక్తులు కూర్చునేందుకు వీలుగా ఫ్లాట్‌ఫారమ్‌లు నిర్మాణానికి రూ.40 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. విశాఖపట్నానికి చెందిన సంతోష్ ఇంజినీరింగ్ వర్క్స్ 27.27 శాతం తక్కువకు టెండర్ దాఖలు చేసింది. ఆ సంస్థకు నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయం.
● ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే మూడో తేదీ వరకు జరగనున్న సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలకు స్వామివారి ఆలయంతో పాటు వ్రత మండపాలు, ఇతర ఆలయాలు, వార్షిక కల్యాణ మండపానికి రంగులు వేసేందుకు టెండర్లు పిలుస్తారు.
● సత్యగిరిపై గల హరిహరసదన్ సత్రంలో బాత్‌రూమ్స్‌లో వాటర్ లీకేజీ ట్రీట్మెంట్, తదితర పనులకు రూ.17 లక్షలతో రూపొందించిన అంచనాలకు. త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశం.
● సత్యగిరిపై గల విష్ణుసదన్ సత్రంలో టాయిలెట్స్‌లో రూ.16.5 లక్షలతో వాటర్ లీకేజీ ట్రీట్మెంట్ పనులు చేయించేందుకు రూపొందించిన అంచనాలకు ఆమోదం. వీటికి కూడా త్వరగా టెండర్లు పిలవాలని నిర్ణయం.
● కొండదిగువన జూనియర్ కళాశాల గేటు పార్కింగ్ గోడ ఎత్తును 12 అడుగుల నుంచి 18 అడుగులకు పెంచేందుకు రూ.నాలుగు లక్షల వ్యయంతో చేపట్టే పనుల అంచనాలకు ఆమోదం.
● రూ.8.5 లక్షలతో వివిధ చోట్ల 22 స్టెయిన్‌లెస్ స్టీల్ టికెట్ కౌంటర్ టేబుల్స్ తయారీ అంచనాలకు ఆమోదం
● రానున్న వేసవి నేపథ్యంలో దేవస్థానం ఆవరణలో రూ.15 లక్షలతో పలుచోట్ల తాటాకు పందిర్లు, షామియానాలు వేయాలని నిర్ణయం.


