రోడ్డు ప్రమాదాలు నివారించాలి
కాకినాడ క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, పూర్తి నివారణకు సంబంధిత ఎస్‌హెచ్‌వోలు తగిన రీతిలో అప్రమత్తమవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశించారు. బుధవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు సాంకేతికత సాయం తీసుకోవాలన్నారు. స్టాప్ వాష్ అండ్ గో ద్వారా అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున చోదకులు ముఖం కడిగేలా చొరవ చూపాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద బారికేడ్లు, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి అతి వేగాన్ని నియంత్రించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తరచు గొడవలు, కొట్లాటల్లో పాల్గొనే వ్యక్తులపై రౌడీ షీట్లు తెరవాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించేందుకు స్కల్ సూపర్ ఇంపోజిషన్ విధానాన్ని అనుసరించాలన్నారు. ప్రాపర్టీ రికవరీలు చేపట్టాలన్నారు. జాతరలు, పండగలు, ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు జరగకుండా చూడాలన్నారు.


