రత్నగిరిపై విస్తృత ఏర్పాట్లు
అన్నవరం: భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి నాడు సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశమున్నందున రత్నగిరి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ, దేవస్థానం అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ రెండు రోజులతో పాటు మాఘమాసంలో వివిధ పర్వదినాల్లో వచ్చే భక్తుల సౌకార్యర్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రకాష్ సదన్‌లోని ట్రస్ట్ బోర్డు సమావేశ హాలులో పెద్దాపురం ఆర్‌డీఓ శ్రీరమణి అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. అన్నవరం దేవస్థానం తరఫున చేస్తున్న ఏర్పాట్లను ఈఓ వి.త్రినాథరావు వివరించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఏపీఎస్ ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల అధికారులు కూడా సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ నిర్ణయాలు..
● ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి, 15వ తేదీన మహాశివరాత్రితో పాటు మాఘ మాసంలో వచ్చే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో సత్యదేవుని సన్నిధికి వేలాదిగా భక్తులు రానున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలి.
● భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి పర్వదినాల్లో ముందు రోజు సాయంత్రం నుంచే వేలాదిగా భక్తులు రత్నగిరికి వస్తారు. దీనికి తగినట్లుగా చర్యలు చేపట్టాలి.
● ఈ రెండు రోజుల్లో అర్ధరాత్రి 12.30 గంటల నుంచే సత్యదేవుని వ్రతాల నిర్వహణ ప్రారంభించాలి. వేకువజామున ఒంటి గంట నుంచే స్వామివారి దర్శనానికి అనుమతించాలి.
● క్యూలో భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందజేయాలి. స్వచ్ఛంద సేవా కార్యకర్తల సహకారంతో పలుచోట్ల క్యాన్ల ద్వారా మంచినీరు అందించాలి.
● ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రసాదాలపై ఎలుకలు పరుగులు పెడుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అయినందున అటువంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని కౌంటర్లలో తగు చర్యలు తీసుకోవాలి.
● ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు చేపట్టాలి. భారీ వాహనాలను కొండ దిగువన హైస్కూల్ మైదానంలో నిలుపు చేయాలి. కార్లు, ఇతర చిన్న వాహనాలను మాత్రమే రత్నగిరికి అనుమతించాలి. ఈ కార్లను సత్యగిరిపై హరిహర సదన్ ఆవరణలో, సత్యగిరి రోడ్డు పక్కన పార్కింగ్ ప్రదేశంలో, ప్రకాష్ సదన్ సత్రం వద్ద నిలుపు చేయాలి.
● రత్నగిరి, సత్యగిరి మధ్య భక్తుల కోసం ఉచిత బస్సులు నడపాలి. గతంలో మాదిరిగా టాటా మ్యాజిక్ వాహనాలను కూడా ఇందుకు ఉపయోగించాలి.
● కార్తిక మాసంలో మాదిరిగానే కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసి, భక్తులను విడతల వారీగా స్వామివారి దర్శనానికి పంపించాలి.
● భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి నాడు ఉదయం 8 గంటల నుంచి సర్కులర్ మండపం వద్ద భక్తులకు దధ్యోదనం, పులిహోర పంపిణీ చేయాలి.
● భక్తులందరికీ వసతి గదులు లభించే అవకాశం లేనందున డార్మెట్రీలు, విశ్రాంతి మండపాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలి. మూఢం కారణంగా ప్రస్తుతం వివాహాలు లేనందున సత్యగిరిపై విష్ణుసదన్ హాళ్లలో కూడా భక్తుల వసతికి చర్యలు తీసుకోవాలి.
● దేవస్థానంలో పలుచోట్ల అదనపు టాయిలెట్లు సిద్ధం చేయాలి.
● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, దేవస్థానం ఉచిత వైద్యశాల సిబ్బంది సహకారంతో దేవస్థానంలో మూడుచోట్ల వైద్య శిబిరాలు నిర్వహించాలి.
● దివ్యాంగుల కోసం వై జంక్షన్ నుంచి పశ్చిమ రాజగోపురం వరకూ బ్యాటరీ కార్లు నడపాలి.
● కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం నుంచి అన్నవరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలి.
ఫ భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమికి
వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం
ఫ అన్ని చర్యలూ తీసుకోవాలని
అధికారుల నిర్ణయం


