రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎటపాక: ఆటో అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అడిషనల్ ఎస్సై రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం కూనవరం మండల కేంద్రానికి చెందిన మచ్చా నాగేశ్వరరావు(27) వరసకు తన అన్న కూతురు లావణ్యను తన కొత్త బైక్‌పై ఎక్కించుకుని తెలంగాణలోని వెంకటాపురం నుంచి కూనవరం వస్తున్నాడు. ఈ క్రమంలో కూనవరం నుంచి ఆరుగురు ప్రయాణికులతో పల్లూరుకు చెందిన షేక్‌రహీమ్ తన ఆటోలో భద్రాచలం వెళుతున్నాడు. ఆ సమయంలో ఎటపాక మండలం బూట్టాయిగూడెం శివాలయం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో అదుపు తప్పడంతో జరిగిన ఈ ప్రమాదంలో బైక్ నుజు నుజ్జు కాగా నాగేశ్వరరావుకు తల, సున్నితమైన భాగాలలో బలమైన గాయాలయ్యాయి. లావణ్యకు కాలు విరగగా ఆటోలోని ప్రయాణికులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో నాగేశ్వరరావు మరణించాడు. మృతుడి తండ్రి గతంలో మరణించగా తల్లికి ఆసరాగా ఉన్న అవివాహిత కుమారుడు కూడా మరణించటంతో తల్లి చిట్టెమ్మ రోదన అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


