కొత్త శ్రామికలోకం
కాకినాడ క్రైం: జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, బ్లింకిట్... ఇలా పేరేదైనా, సేవ ఏదైనా వినియోగదారులు కోరుకున్న వస్తువు లేదా ఆహారాన్ని చెప్పిన సమయానికి, కోరిన చోటుకు చేర్చే గిగ్ వర్కర్ల వ్యవస్థ జిల్లాలో నానాటికీ విస్తరిస్తోంది. వీరి వల్ల వినియోగదారులకు గతం కంటే క్రయవిక్రయాల ప్రక్రియ సులభతరమైంది. మునుపటి కంటే కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. యాప్‌లో ఆర్డర్ పెట్టడంతో నిమిషాల్లో తమ అవసరాలు తీరుతూండటం, సమయం, ఇంధనం వృథా కాకుండా కోరుకున్న వస్తువులు సకాలంలో ఇళ్లకు చేరుతూండటంతో ఈ సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. గిగ్ వర్కర్ల కృషితో ఈ–కామర్స్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వృద్ధి చెందుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ఈ వ్యవస్థను క్షేత్ర స్థాయిలో తమ భుజాలపై మోస్తూ.. అటు కార్పొరేట్ల వ్యాపారానికి తోడ్పడుతూ.. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు ఆర్జించి పెడుతున్న గిగ్ వర్కర్లు ఉద్యోగ భద్రత సహా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
విద్యాధికులు సైతం..
జిల్లాలో విద్యాధికులు సైతం గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన ఓ వ్యక్తి ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమవడంతో ఓ యాప్‌లో ఫుడ్ డెలివరీ పార్టనర్‌గా చేరాడు. గత డీఎస్సీలో ఎంపికవలేకపోయిన ఓ యువతి గిగ్ వర్కర్‌గా పని చేస్తోంది. కాకినాడలో పోలీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువకుడు సైతం రైడర్‌గా పని చేస్తున్నాడు. మహిళలు, దివ్యాంగులు కూడా సంపాదన కోసం ఈ బాట పడుతున్నారు. గత నవంబర్ గణాంకాల ప్రకారం, జిల్లాలో 7 వేల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. వీరిలో 2,500 నుంచి 3 వేల మంది వరకూ బ్లింకిట్, జొమేటో, స్విగ్గీల కోసం పని చేస్తున్నారు. 1,500 నుంచి 2 వేల మంది వరకూ ఓలా, ర్యాపిడో రైడర్లుగా ఉన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ పార్టనర్లుగా 1,200 నుంచి 1,500 మంది వరకూ పని చేస్తున్నారు. అర్బన్ కంపెనీ, స్థానిక ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలు, ఇతర యాప్‌ల కోసం సుమారు 500 మంది పని చేస్తున్నారు. ఎక్కువ మంది కాకినాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లోనే పని చేస్తున్నారు.
కూలీల కంటే దయనీయం
ఫ యాప్‌లో పేర్కొన్న లొకేషన్ ప్రకారం కాకినాడ ఆటోనగర్‌లోని ఓ నిర్మానుష్య మైదాన ప్రాంతంలో ఆపి ఉన్న వ్యాన్‌లోని వ్యక్తులకు రాత్రి 11.30 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ రైడర్‌పై మద్యం మత్తులో ఉన్న ముగ్గురు ఇటీవల దాడి చేశారు. చేసిన ఆర్డర్‌కు డబ్బులివ్వకపోగా, డెలివరీ బాయ్ వద్ద ఉన్న రూ.2 వేలు కూడా లాక్కున్నారు.
ఫ నిమిషాల వ్యవధిలో కిరాణా డెలివరీ ఇస్తామన్న ఓ యాప్‌లో పని చేస్తున్న ఓ గిగ్ వర్కర్ త్వరగా డెలివరీ ఇవ్వాలనే ఆత్రంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ బోట్‌క్లబ్ ఎదుట ప్రమాదానికి గురయ్యాడు. ఆ గాయాలతోనే ఐటెం డెలివరీకి వెళ్లాడు.
ఫ ఇటువంటి ఘటనలు తరచుగా ఎన్నో జరుగుతున్నాయి. గిగ్ వర్కర్లది రోజు కూలీల కంటే దయనీ య స్థితి. వీరికి స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత ఉండవు, పీఎఫ్, ఈఎస్‌ఐ సేవల ఊసే లేదు. విధి నిర్వహణలో సైతం వీరికి ఎటువంటి భద్రత, బీమా వంటివి ఉండవు. ఉన్నా నామమాత్రంగానే సరిపెడతారు. యాప్, ఆల్గారిథం ఆధారంగా రేటింగ్ తగ్గితే పని కోల్పోవడం లేదా ఆదాయం తగ్గిపోవడం వీరికి పరిపాటి. కనీస వేతనాలు అమలు కావు. కేవలం టాస్క్, ప్రాజెక్టు ఆధారిత పారితోషికం అందుకుంటారు. సంస్థలు కూడా వారిని ఉద్యోగులుగా పరిగణించవు.
చట్టమున్నా..
గిగ్ వర్కర్ల రక్షణ, ఉద్యోగ భద్రతకు సోషల్ సెక్యూరిటీ కోడ్–2020 పేరుతో ప్రత్యేక చట్టం ఉంది. కోవిడ్ ఉధృతంగా ఉన్న నాటి సమయంలో.. ఆన్‌లైన్ కార్యకలాపాలపై దేశం ఆధారపడిన వేళ.. వీరి ప్రాధాన్యాన్ని గుర్తించి, అప్పటికప్పుడు ఈ చట్టాన్ని రూపొందించారు. ఆరోగ్య, ప్రమాద బీమా, వృద్ధాప్య భద్రత, పింఛను, వైద్య సహాయం, మాతృత్వ ప్రయోజనాలు ఈ చట్టం పరిధిలో గిగ్ వర్కర్లకు అందాలి. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేయాలి. దీనికిగాను గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అయితే, ఈ చట్టంలోని ఏ ఒక్క అంశమూ అమలుకు నోచుకోలేదు. ఈ చట్టంపై గిగ్ వర్కర్లలో అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు ఇప్పటి వరకూ ప్రవేశపెట్టలేకపోయింది. అసంఘటిత కార్మికులకు వర్తించే ఈ–శ్రమ్, ఆరోగ్య బీమా, యూఏఎన్ వంటివి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు.
గిగ్ వర్కర్లు ఎవరంటే..
స్థిరమైన ఉద్యోగం లేకుండా, తాత్కాలిక, అప్పటి అవసరాలకు అనుగుణంగా పని చేసే కార్మికులను గిగ్ వర్కర్లు అంటారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, ఈ–కామర్స్ డెలివరీ బాయ్స్, ఓలా, ఊబర్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ డిజైనర్లు, రైటర్లు ఈ కోవకు వస్తారు. నిరుద్యోగ సమస్య నానాటికీ తీవ్రమవుతూండటం.. వస్తున్న ఆదాయం చాలకపోవడం లేదా అసలు ఆదాయమే లేకపోవడం వంటి కారణాలతో పలువురు గిగ్ కార్మికులుగా మారుతున్నారు. వీరిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. అనుకూలమైన పని వేళలు, రోజువారీ పేమెంట్లు ఉండటంతో చాలీచాలని జీతాలకు పని చేస్తున్న పలువురు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రోజువారీ జీవనం భారంగా మారుతూండటం, ఉద్యోగాలేవీ లేకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో ఇంటిని పోషించుకోవడానికో, భర్తకు చేదోడువాదోడుగానో ఇటీవల యువతులు, మహిళలు కూడా ఈ దారి ఎంచుకుంటున్నారు.
నిరుద్యోగులే..
నిరుద్యోగులే గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఎటువంటి భ విష్యత్తూ ఉండదు. అయినప్పటి కీ అవసరాలు ముంచుకు రావ డంతో మరో ఉద్యోగం లేక ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కష్టాలు చెప్పుకోవడానికి యజమాని కూడా ఉండడు. ప్రమాదాలు జరిగితే చూసిన వారే తప్ప సంస్థలు ఎటువంటి సాయం చేయవు. నామమాత్రపు ఇన్సూరెన్స్‌లు ఇస్తూ శ్రమ దోచుకుంటున్నాయి. విధి నిర్వహణలో ఎలాగూ గౌరవ మర్యాదలుండవు. కనీ సం ప్రభుత్వమైనా తగిన భద్రత, భరోసా కల్పించాలి.
– ఎ.వెంకటేష్, కాకినాడ, ఫుడ్ డెలివరీ పార్టనర్
సంఘటితమైతేనే..
సంఘటితమైతేనే గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రత్యక్ష పోరాటాల ద్వారా వారి స్థితి మెరుగుపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వారిది కీలక పాత్ర. కనీస వేతనాలు, బీమా సౌకర్యాలు కల్పిస్తేనే ఈ రంగం స్థిరంగా మనుగడ సాగించగలుగుతుంది. గిగ్ వర్కర్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున వారి హక్కులు, భద్రతపై స్పష్టమైన విధానాలు అవసరం.
ప్రభుత్వం, డిజిటల్ కంపెనీల సంయుక్త బాధ్యతతోనే ఈ కొత్త కార్మిక వర్గానికి భద్రత, భరోసా దక్కుతాయి. డెలివరీకి చెల్లింపు పెంచాలి. వేగం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ–కామర్స్ యాప్‌లను ఒకే వేదిక పైకి తెచ్చేలా ప్రభుత్వమే కొత్త యాప్ ప్రవేశపెట్టి నిర్వహించాలి. సంఘం జిల్లా ట్రెజరర్ మలకా వెంకట రమణ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్లను సంఘటితం చేస్తున్నాం.
– పలివెల వీరబాబు,
సీఐటీయూ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు,
కాకినాడ
ఫ సేవా రంగంలో తాత్కాలిక ఉద్యోగులు
ఫ స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత శూన్యం
ఫ గిగ్ వర్కర్ల గావుకేక
ఫ జిల్లాలో 7 వేల మంది
ఫ వీరి సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం
కొత్త శ్రామికలోకం


