ప్రత్యక్ష దేవుడి పెళ్లికి వెళ్లొద్దాం రండి! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష దేవుడి పెళ్లికి వెళ్లొద్దాం రండి!

Jan 28 2026 11:08 AM | Updated on Jan 28 2026 11:08 AM

ప్రత్యక్ష దేవుడి పెళ్లికి వెళ్లొద్దాం రండి!

ప్రత్యక్ష దేవుడి పెళ్లికి వెళ్లొద్దాం రండి!

పెదపూడి: దేశంలోనే ఏకై క వైష్ణవ సంప్రదాయ సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి కల్యాణ మహోత్సావానికి అంతా సిద్ధమైంది. స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని పరమహంస పరివ్రాజకాచార్య, వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్య, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామివారి మంగళ శాసనాలతో భీష్మ ఏకాదశి గురువారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ఈఓ పాటి సత్యనారాయణ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలల్లో హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా బాణసంచా సిద్ధం చేశారు.

కల్యాణం రోజున జరిగే కార్యక్రమాలు

ఈ నెల 25న రథసప్తమి రోజున ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 2తో ముగుస్తాయి. స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 5 గంటలకు నిత్యోపాసన, విశేష హోమం, బలిహరణ, 8 గంటలకు ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్‌ సెంటర్లో భారీ అన్న సమారాధన, మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీవారి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామి కల్యాణం ప్రారంభమవుతుంది.

ఆలయ చరిత్ర.. ప్రత్యేకత

ఈ ఆలయ నిర్మాణం వెనుక శతాబ్దం చరిత్రతో పాటు కొవ్వూరి వంశీయుల దాతృత్వం దాగి వుంది. ఆలయంలో 1902 జూన్‌ 18న విగ్రహ ప్రతిష్ఠ శ్రీ వైష్ణవ సంప్రదాయ రీతిలో చేశారు. దేశంలో కోణార్క్‌, అనంతనాగ్‌, గయ, రాష్ట్రంలో ఆరసవల్లి సూర్యదేవాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రమే వైష్ణవ సంప్రదాయంలో పూజలు చేస్తారు. నాలుగు అంతస్తులతో శిలా కావ్యాలను ఆలయంలో నిర్మించారు. అహోబల సంస్థానంలో కొవ్యూరి భూమంచిరెడ్డి వంశీయులు దండనాయకులుగా, మహానాయకులుగా ఉండేవారు. మహమ్మదీయుల దండయాత్రలతో ప్రాబల్యం కోల్పోయిన ఈ వంశీయులు ఉభయ గోదావరి జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొవ్యూరి బసివిరెడ్డి వ్యాపారంలో అభివృద్ధి సాధించి భూములు, సిరి సంపదలు కూడగట్టారు. గృహ, వస్త్ర, అన్నదానాలతో పాటు బావులు తవ్వించారు. వనాలు పెంచారు. దేవాలయాల నిర్మాణాలను చేపట్టారు. ఈయన సేవలను కొనియాడుతూ 1897 బ్రిటిష్‌ మహారాణి ప్రశంసాపత్రం పంపించారు. ఈయన దాతృత్వానికి కుతుకులూరు, కాకినాడ, గొల్లల మామిడాడ, గండ్రేడు, నిడదవోలు తదితర ప్రాంతాల్లోని బసివిరెడ్డి పేటలే తార్కాణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక బావులు తవ్వించారు. నిత్యాన్నదానం చేస్తున్న సామర్లకోట బసివిరెడ్డి సత్రం ఈయన చలవతోనే నడుస్తోంది. అన్నవరం తర్వాత గొల్లల మామిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయంలోనే ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి.

ఉత్సవాలు ఇలా..

30వ తేదీ ఉదయం, సాయంత్రం నిత్యార్చన, నిత్యహోమాలు, బలిహరణ

31న సాయంత్రం 4 గంటలకు సదస్యం, స్వామివారి గరుడ వాహన తిరువీధి ఉత్సవం

1వ తేదీ ఉదయం 7 గంటలకు పవిత్ర తుల్యభాగనదీ తీరాన స్వామి వారి చక్రస్నానం, ఆలయంలో మహా పూర్ణాహుతి

2వ తేదీ రాత్రి 7 గంటలకు అద్దాల శయన మందిరంలో ఉయ్యాలసేవ, శ్రీపుష్పయాగ మహోత్సవం

రేపు జరిగే సూర్యనారాయణమూర్తి కల్యాణానికి అంతా సిద్ధం

భారీ ఏర్పాట్లు చేసిన

జి.మామిడాడ ఆలయ ఉత్సవ కమిటీ

రాష్ట్రం నలుమూలల నుంచి

వేలల్లో హాజరుకానున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement