గిరి ప్రదక్షిణలో భద్రంసుమా!
● సత్యదేవుని సన్నిధికి రేపు
లక్షల మంది వస్తారని అంచనా
● అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి
● కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో
దేవదాయ శాఖ కమిషనర్
అన్నవరం: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో అన్నవరం దివ్యక్షేత్రంలో బుధవారం జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఒక్క రోజే 3 లక్షల మంది భక్తులు అన్నవరం వచ్చే అవకాశమున్న నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సోమవారం అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, కాకినాడ ఉప కమిషనర్ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కమిషనర్ ఆదేశాలివీ..
● ఉదయం 8 గంటలకల్లా తొలి పావంచా నుంచి గిరి ప్రదక్షిణ సత్యదేవుని పల్లకిలో లాంఛనంగా ప్రారంభించి మధ్యాహ్నం 12కు ముగించాలి.
● మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా సత్యదేవుని ప్రచార రథం మీద స్వామివారి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. ఇందులో సుమారు 2 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. అందువలన వారికి ఇబ్బంది కలగకుండా, తొక్కిసలాటకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేయాలి.
● స్వామివారి ప్రచార రథం చుట్టూ రోప్ పార్టీ ఉండాలి. ఎక్కడా ఆగకుండా గిరి ప్రదక్షిణ సాగిపోయేలా చూడాలి. సాధ్యమైనంత వరకూ చీకటి పడే సమయానికి పంపా తీరానికి చేరుకోవాలి.
● కొండ దిగువన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చూసేందుకు దేవదాయ శాఖ రీజినల్ కమిషనర్ (రాజమహేంద్రవరం) వి.త్రినాథరావును ప్రత్యేక అధికారిగా నియమించాం. ఆయన మంగళవారం నుంచి అన్నవరంలోనే ఉండి, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చూస్తారు. ఆయనకు కాకినాడ డీసీ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి ఈఓలు విశ్వనాథరాజు, చక్రధర్‌రావు సహకరించాలి.
● రత్నగిరిపై ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించాలి. ఆ రోజు సత్యదేవుని దర్శనానికి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం భక్తుల రద్దీ తగ్గాక గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో పాల్గొనాలి. భక్తుల ఏర్పాట్లు వదిలేసి వైదిక కార్యక్రమాలు, పూజలు అంటూ వెళ్లకూడదు. గిరి ప్రదక్షిణలో ఎక్కడ లోటు జరిగినా ఈఓదే బాధ్యత.
● దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆయన కూడా రత్నగిరిపై సేవలందించవచ్చు.
● గిరి ప్రదక్షిణ రోడ్డులో పులిహోర, బిస్కెట్లు, ఇతర ఫలహారాల స్టాల్స్, మంచినీటి పాయింట్లు, టాయిలెట్లు తదితర ఏర్పాట్లను మంగళవారం మరోసారి పరిశీలించాలి.
● గత నెల 25న అన్నవరంలో జరిపిన సమీక్షలో దేవస్థానంలో అన్నిచోట్లా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినా చాలాచోట్ల పెట్టలేదు. వాటిని వెంటనే ఏర్పాటు చేయాలి.
ఎస్పీ సమీక్ష
జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ సోమవారం సాయంత్రం అన్నవరం వచ్చి, గిరి ప్రదక్షిణ రోడ్డును పరిశీలించారు. అనంతరం ఈఓ సుబ్బారావు, ఇంటెలిజెన్స్, పెద్దాపురం డీఎస్పీలు కేవీ సత్యనారాయణ, శ్రీహరిరాజు, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్సై శ్రీహరిబాబు తదితరులతో సమావేశమై, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన ఆదేశాలివీ..
● గిరి ప్రదక్షిణ సమయంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నవరం గ్రామంలోకి వాహనాల రాకపోకలను నియంత్రించాలి. వాహనాలను హైవే మీదనే అనుమతించాలి.
● గిరి ప్రదక్షిణ పుష్కర కాలువ వరకూ సుమారు రెండు కిలోమీటర్లు హైవే మీదనే సాగుతుంది. ఆ సమయంలో రాజమహేంద్రవరం – విశాఖపట్నం వైపు రోడ్డు మీద వచ్చే వాహనాలను పక్క లేన్‌లోకి మళ్లించాలి. భారీ వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేయాలి.
● అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రం, రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
● సేవాదళాలు, వలంటీర్ల ద్వారా భక్తులకు సహకారం అందించాలి.
● గిరి ప్రదక్షిణ జరిగే మార్గమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.


